Fact Check : దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం అందలేని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఏపీ ప్రభుత్వానికి ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బార్జ్ బ్రండే రాసిన లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత ఏడాది నవంబర్ 25వ తేదీనే ఈ ఆహ్వాన పత్రిక ఏపీ ప్రభుత్వానికి అందింది. ప్రతీ ఏడాది జరగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ ఏడాది కూడా పాల్గొనాలని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు లేఖలో కోరారు. సోషియో ఎకనామిక్ డెలవప్‌మెంట్ మీద ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న ఆసక్తి గొప్పగా ఉందని.. ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పని చేయడానికి తమ ఫోరమ్ ఎంతో ఆసక్తిగా ఉందన్నారు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు జరుగుతోంది. దీనికి ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులు, ప్రభుత్వాల ప్రతినిధులు హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి కేటీఆర్ తోపాటు.. దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధి బృందం దావోస్‌కు వెళ్లింది. అక్కడ ఎక్కువ మంది తమ రాష్ట్రాల ను ప్రమోట్ చేసుకుంటూ పెవిలియన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. గత ఏడాది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా దావోస్ వెళ్లారు. లక్ కోట్లరుపైగా పెట్టుబడులు ఆకర్షించారని ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో 1.25 లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. గ్రీన్ ఎనర్జీకు సంబంధించి 1 లక్షా 25 వల కోట్లు రూపాయలు పెట్టుబడులపై అదానీ, గ్రీన్ కో, అరబిందో సంస్థలతో ఒప్పందం పూర్తయింది. పంప్డ్ స్టోరేజ్ వంటి వినూత్న విధానాలతో 27 వేల 7 వందల మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలో అందుబాటులో వస్తుందని తెలిపింది.
అయితే ఈ సారి దావోస్‌కు ప్రతినిధి బృందం వెళ్లలేదు. సీఎం జగన్ కూడా వెళ్లలేదు. దీంతో దావోస్ నుంచి ఈ సారి ఏపీకి ఆహ్వానం రాలేదన్న ప్రచారం జరిగింది. కానీ ఆహ్వానం వచ్చిందని.. ప్రభుత్వమే ఆసక్తి చూపలేదని తాజాగా తేలింది. ఏపీ ప్రభుత్వం త్వరలో విశాఖలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రముఖుల్ని ఆహ్వానించాలని అనుకుంటోంది. సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల సీఈవోలు, చైర్మన్లు, దేశంలోని వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు. ముఖ్యంగా ఇన్వెస్టర్లను తరలి రావాలని కోరుతోంది. ఇలాంటి సమయంలో... ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు సీఎం నేతృత్వంలో ప్రతినిధి బృందం వెళ్లినట్లయితే.. అక్కడే అందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానం ఇచ్చినట్లు ఉండేదన్న వాదన పారిశ్రామిక వర్గాల్లో వినిపిస్తోంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎందుకో ఆసక్తి చూపించలేదు.