Visakha Steel Plant: ప్రజలు నిలదీయక ముందే విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వైఖరి ఏంటో చెప్పాలని ఏపీ మాజీ మంత్రి, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కుట్రలు చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ కోసం వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కుట్రలు జరుగుతున్నాయంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలుగు వారి ఆత్మగౌరవం స్టీల్ ప్లాంట్


ఆదివారం విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యావత్ రాష్ట్రం ఒక సమస్య పైనే దృష్టి పెట్టింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటన్నది స్పష్టం చేయాలన్నారు. ఉక్కు మంత్రి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ చూశారు. ఏం చేస్తారో చెప్పాలి. స్టీల్ ప్లాంట్ తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు ప్రజలకు సంబంధించిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.  ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు.


మా వల్లే ఆగింది
వైసీపీ ప్రభుత్వం హయంలో.. మేం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకం అని కేంద్రానికి చెప్పడం వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు. ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మా వల్లే ఆగింది. వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో కేంద్రంలోని ఎన్డీయేకి బలం ఎక్కువ ఉంది. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ ప్రైవేటీకరణ అపాలి. ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామిగా ఉండి కూడా ప్రైవేటీకరణ కు ఎందుకు అడుగులు పడుతున్నాయని ప్రశ్నించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వకుండా తాము పోరాటాలు చేస్తామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 


ఆ విషయం మోడీకి చెప్పేశారు 
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని ప్రధాని మోదీకి వైఎస్‌ జగన్‌ చెప్పారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికులకు వైసీపీ అండగా ఉంటుంది. గత 15 రోజులుగా స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు నిరసన చేస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వం వైఖరీ చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. 32 మంది త్యాగాల కారణంగా ఏర్పడింది. 32 వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు.. వైఎస్ హయాంలో స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం11 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కష్టాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ విశాఖ వచ్చిన సందర్భంలో విశాఖను స్టీల్ ప్లాంట్ పైవేటికరణ చేయొద్దని వైఎస్‌ జగన్ అడిగారు. ప్రధానికి రెండు సార్లు లేఖలు రాశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే టీడీపీ నేతలు రాజీనామాలు చేస్తామంటున్నారు. ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు వలన ఒరిగేది లేదు.


నష్టాల్లో లేదు అప్పుల్లో ఉంది 
విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో లేదు అప్పుల్లో ఉందని మాజీ మంత్రి  గుడివాడ అమర్నాథ్ అన్నారు. రోజు రోజుకు అప్పుల ఊబిలోకి వెళ్తుందన్నారు. రాజీనామాలతో ఈ సమస్య పరిష్కారం కాదన్నారు.  ఈ ప్రైవేటికరణ ఆగాలి అంటే ..కేంద్రం తో చంద్రబాబు ఒక మాట చెబితే చాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మద్దతు ఉపసంహరించుకుంటాం అని అంటే చాలు.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదన్నారు. రాజీనామాలు చేశామని చెప్తున్న వారు కోర్ట్ కి వెళ్లి రాజీనామా నిలుపుదల చేసుకోవాలి అనుకున్నారా లేదా అని ప్రశ్నించారు. వైసిపి హయాంలో నరేంద్ర మోదీ కూడా చెప్పామన్నారు.  వైసిపి స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతామన్నారు.