Mydukuru Constituency YSRCP:  మ‌రో 3 మాసాల్లో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు(Elections) జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుత అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress party) ప్ర‌తి విష‌యాన్నీ చాలా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని రెండోసారి అధికారంలోకి రావాల‌ని ప‌రిత‌పిస్తున్న వైసీపీ.. దానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ఐప్యాక్ స‌ర్వే స‌హా.. వ‌లంటీర్లు, ఇత‌ర మాధ్య‌మాల్లో అభ్య‌ర్థుల ప‌నితీరు, ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌డుతున్న విష‌యం తెలిసిందే. 


వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్‌ 
ఈ స‌ర్వే నివేదికల ఆధారంగా.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. కీల‌క‌మైన నాయ‌కుల‌కు కూడా వైసీపీ(YSRCP) అధిష్టానం స్థానాంత‌రం క‌ల్పించింది. వారు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా మ‌రో నియోజ‌క‌వ‌ర్గాల‌ను వారికి కేటాయించింది. మ‌రికొంద‌రిని అస‌లు ఎలాంటిఅవ‌కాశం లేకుండా ప‌క్క‌న కూడా పెట్టేసింది. దీనికి ఇష్ట‌ప‌డి వారు.. పార్టీ నుంచి వెళ్లిపోతున్నా.. వైసీపీ మాత్రం త‌న ప‌నితాను చేసుకుని పోతోంది. 


సర్వేలే ముందు 
ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి(YS JaganMohanReddy) సొంత జిల్లా ఉమ్మ‌డి క‌డ‌ప‌లోనూ స‌ర్వేల ఆధారంగానే టికెట్ లు కేటాయించే కార్య‌క్ర‌మానికి వైసీసీ అధిష్టానం శ్రీకారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో క‌డ‌ప‌లోని 10 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ.. వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన విష‌యం తెలిసిందే. పైగా భారీ మెజారిటీ ద‌క్కింది కూడా ఇక్క‌డే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మొత్తం అన్ని స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకునేలా పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. 


మార్పులు- చేర్పులు 
ఈ క్ర‌మంలో స్థానిక ప‌రిస్థితులు, సామాజిక వ‌ర్గాల కూర్పు, స‌ర్వే నివేదిక‌లు చెబుతున్న అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న వైసీపీ.. ఆ మేర‌కు అభ్య‌ర్థుల‌ను మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పుడు కడప జిల్లాలోని మైదుకూరు(Mydukuru) హాట్ టాపిక్‌గా మారిపోయింది. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం మైదుకూరు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న శెట్టిప‌ల్లి ర‌ఘునాథ‌రెడ్డి(Settypalli Raghunadh Reddy). ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లిజ(Balija) సామాజిక వ‌ర్గం డామినేష‌న్ ఎక్కువ‌గా ఉండ‌డం, ఆయ‌న వీరిని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కొన్నాళ్లుగా ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది.  


సొంత సామాజిక వ‌ర్గం సెగ‌ 
అదేస‌మ‌యంలో సొంత సామాజిక వ‌ర్గం నుంచి కూడా ర‌ఘునాథ‌రెడ్డి(Settypalli Raghunadh Reddy) కి సెగ త‌గులుతోంది. ప‌నులు ఏమీ చేయ‌డం లేద‌ని.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జెండాలు మోసి.. గెలుపు కోసం ప‌నిచేసిన త‌మ‌ను క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రెడ్డి సామాజిక‌వర్గం(Reddy Community) నాయ‌కులు అధిష్టానానికి ఏడాది నుంచి ఫిర్యాదులు పంపిస్తున్నారు. అయితే.. దీనిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్దిచెబుతూనే ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఎన్నిక‌ల‌కు ముందు.. అటు బ‌లిజ‌, ఇటు రెడ్డి వ‌ర్గం నుంచి కూడా శెట్టిప‌ల్లిపై వ్య‌తిరేక‌త పెరుగుతున్న‌ట్టు పార్టీ ఒక అంచ‌నాకు వ‌చ్చింది. 


ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం 
ఎమ్మెల్యే సహకారంతో బ్రహ్మంగారి మఠం మండలానికి చెందిన జడ్పిటిసి గోవిందరెడ్డి(Govinda Reddy), ఎంపీపీ వీరనారాయణరెడ్డి(Veera Narayana Reddy)ల వ్య‌వ‌హార శైలిపైనా స్థానిక నేత‌లు మండిప‌డుతున్నారు. దీంతో ఎటు చూసినా.. ఎన్నిక‌ల్లో ఈ ప‌రిణామాలు ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. మ‌రోవైపు టీడీపీ నుంచి వ‌చ్చిన మాచినూరి చంద్ర కూడా ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వున్నాయి. ప్రస్తుతం ఈయ‌న‌ మున్సిపల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.


ల‌క్ష్యం నెర‌వేర‌లేదు 
అస‌లు మాచినూరిని వైసీపీలోకి తీసుకోవ‌డం వెనుక‌.. బ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన ఈయ‌న వైసీపీకి ద‌న్నుగా మార‌తార‌నే. అంతేకాదు.. బ‌లిజ‌సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను వైసీపీకి అనుకూలంగా మారుస్తార‌నే. కానీ ఈయ‌న ఈ విష‌యంలోపూర్తిగా విఫ‌ల‌మైన‌ట్టు పార్టీ గుర్తించింది. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డి ప‌రిణామాల‌పై ఒక అంచ‌నాకు వ‌చ్చిన వైసీపీ అధిష్టానం.. అన్ని స‌మ‌స్య‌ల‌కు ఒకే ఒక్క ప‌రిష్కారంగా ఎమ్మెల్యే అభ్య‌ర్థిని మార్చ‌డంతోపాటు.. ఈ ద‌ఫా బ‌లిజ సామాజిక వ‌ర్గానికి పెద్ద‌పీట వేస్తూ.. ఆ సామాజిక వ‌ర్గం నేత‌కు టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. వాస్త‌వానికి ఈ ద‌ఫా టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే త‌న‌యుడు ముందున్నారు. అయిన‌ప్ప‌టికీ.. పార్టీ బ‌లిజ వ‌ర్గంవైపు మొగ్గు చూపుతున్న‌ట్టు స‌మాచారం.  


స‌న్నిహితుడు.. విధేయుడు


బలిజ సామాజిక వర్గానికి చెందిన సింగసాని గురు మోహన్(Singasani Gurumohan) కు ఈ ద‌ఫా వైసీపీ టికెట్ ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఈయ‌న‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే ఎలా ఉంటుందనే విష‌యంపై నేరుగా సీఎం జ‌గ‌న్ వివిధ  రూపాల్లో స‌ర్వేలు చేయిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో దాదాపు అన్ని సర్వేలు సింగసానికి జై కొట్టిన‌ట్టు తెలిసింది.  దీంతో పార్టీ మారే నేతల కంటే ముఖ్యమంత్రి కి సన్నిహితుడు.. పార్టీ విధేయుడైన సింగసానిని బరిలో దింపితే బాగుంటుందన్న‌దిశ‌గా వైసీపీ అడుగులు వేస్తున్నట్టు స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు స‌మాచారం. 


అన్ని విధాలా మేలే!?


మైదుకూరు(Mydukuru) నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లిజ నేత‌కు టికెట్ ఇవ్వ‌డం ద్వారా  అన్ని విధాలా పార్టీకి మేలు జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని వైసీపీ అధిష్టానం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. క‌డ‌ప పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని పులివెందుల‌(సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం), బ‌ద్వేలు(ఎస్సీ), క‌డ‌ప‌, మైదుకూరుల్లోనూ బ‌లిజ ఓట్లు ఎక్కువ‌గా ఉన్న‌నేప‌థ్యంలో వారంతా వైసీపీకి జై కొడ‌తార‌ని భావిస్తోంది.  మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.