AP Education Department: ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యలో మొదటి భాషగా సంస్కృతం సబ్జెక్టును తీసుకు రావాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఏపీ సర్కారుకు పంపించింది. త్వరలోనే ఉత్తర్వులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాషగా సంస్కృతం భాషను ఎంచుకున్న విద్యార్థులు రెండో భాషగా హిందీకి బదులు తెలుగు సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది. అలాగే మూడో భాషగా ఆంగ్లం(ఇంగ్లీషు) ఉంటుంది. తెలుగు సబ్జెక్టును మొదటి భాషగా తీసుకున్న వారు రెండో భాషగా హిందీ చదవాల్సి ఉండగా.. ఎప్పటిలాగే మూడో భాషగా ఇంగ్లీషు ఉంటుంది. విద్యార్థులు ఆరో తరగతిలో మొదటి భాషను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సంస్కృతం పుస్తకాలు ఆరో తరగతి నుంచి ఉన్నాయి. 


పదో తరగతి పరీక్షల సంస్కరణల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంపొజిట్‌ తెలుగును తొలగించింది. ఇందులో తెలుగు 70 మార్కులు, సంస్కృతం 30మార్కులకు ఉండేది. తెలుగునే వంద మార్కులకు చేసినందున సంస్కృతం సబ్జెక్టుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌ వచ్చింది. దీంతో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కృతం ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అంతేకాదండోయ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కన్నడ, తమిళం, ఒడియా, హిందీ, ఉర్దూ మొదటి భాషగా చదువుతున్న విద్యార్థులు 10వేల వరకు ఉన్నారు. ఇప్పుడు సంస్కృతం తీసుకువస్తే ఈ విద్యార్థుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సంస్కృతంలో ఎక్కువ మార్కులు సాధించే వీలు ఉన్నందున ఎక్కువ శాతం మంది విద్యార్థులు సంస్కృతాన్నే మొదటి భాషగా తీసుకునే అవకాశం కనిపిస్తోంది.