Pawan Kalyan Wishes To Actor Vijay: కోలీవుడ్ స్టార్, తమిళ నటుడు విజయ్ (Vijay) పొలిటికల్ ఎంట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. 'ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నటుడు విజయ్‌కి నా హృదయపూర్వక అభినందనలు.' అని పేర్కొన్నారు. ఇది వైరల్ అవుతోంది.






ఫస్ట్ మీటింగ్.. గ్రాండ్ ఎంట్రీ






కాగా, తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) తొలి రాష్ట్రస్థాయి మహానాడు విల్లుపురం జిల్లాలోని విక్రవాండి సమీప వి.సాలైలో ఆదివారం నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఉదయం నుంచి విక్రవాండి రహదారులు కిక్కిరిసిపోయాయి. దాదాపు 10 - 12 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చాలామంది 10 - 20 కిలోమీటర్ల నడకతో సభకు వచ్చినట్లు తెలుస్తోంది. మార్గమధ్యంలో వేదికవైపుగా వస్తూ.. పార్టీ జెండాలు, విజయ్ ఫోటోలున్న ప్లకార్డులు, వస్త్రాలపై స్టిక్కర్లతో కార్యకర్తలు, అభిమానులు సందడి చేశారు. దాదాపు 8 లక్షల మంది సభకు హాజరైనట్లు తెలుస్తోంది.


విజయ్ గ్రాండ్ ఎంట్రీ


అందరికీ అభివాదం చేస్తూ విజయ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఎటు చూసిన మహానాడుపైనే చర్చ అన్నట్లుగా సాగింది. అటు, సోషల్ మీడియాలో ఇటు, జాతీయ స్థాయిలో దీనిపైనే పెద్దఎత్తున చర్చ సాగింది. టీవికే మహానాడు, తమిళగ వెట్రి కళగం హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి.  సదస్సుకు వచ్చిన వారికి తీపిగుర్తుగా నిర్వాహకులు ప్రత్యేక ప్రయత్నం చేశారు. మొబైల్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్‌ చేస్తే జీపీఎస్ ద్వారా ఉన్న చోటును తీసుకుంటుంది. సభ్యుల వివరాలు పొందుపరచగానే వారికి సదస్సుకు వచ్చినట్లు ధ్రువపత్రం పొందేలా సభా ప్రాంగణంలో పలుచోట్ల ప్లకార్డులు ఏర్పాటు చేశారు. సభ కోసం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 6 వేల మందికి పైగా పోలీసుల్ని ఇక్కడ నియమించారు. ప్రత్యేకించి వేదిక వద్ద ప్రైవేట్ భద్రతను సైతం ఏర్పాటు చేశారు.


'భయపడేది లేదు'


తనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చని.. కానీ పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదని తమిళ స్టార్, దళపతి విజయ్ అన్నారు.  సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగం చాలా సీరియస్ అని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలతో పాటు వివిధ అంశాలపై మాట్లాడారు. 'ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తాం. తమిళనాడు గడ్డకు ఇవి రెండు కళ్లలాంటివి. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా భావజాలం. వాటి ఆధారంగానే పని చేస్తాం. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తాం. నేను నా కెరీర్ పీక్‌లో వదిలేసి మీ అందరిపై అచంచల విశ్వాసాన్ని ఉంచి మీ విజయ్‌గా ఇక్కడ నిలబడ్డా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు కూడా నన్ను అవమానించారు. అయినా, కఠోర శ్రమ, ధైర్యంతో ఈ స్థాయికి చేరుకున్నా. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని పూర్తిస్థాయి మెజార్టీతో గెలిపిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాం.' అని పేర్కొన్నారు.


Also Read: Nara Lokesh America Tour: టెస్లా ప్రతినిధులతో లోకేష్‌ సమావేశం- ఏపీ రావాలని ఆహ్వానం