Srikanth Ayyangar Apology: సినిమా రివ్యూలు రాసే వారిపై రీసెంట్ గా తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ స్పందించారు. కరెక్ట్ విషయాల మీద బేషరతు క్షమాపణ చెబుతా‌ అన్నారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. “నమస్కారమండీ.. నేను శ్రీకాంత్ అయ్యంగార్ ను మాట్లాడుతున్నాను.  ‘పొట్టేల్‌‘ సినిమా సక్సెస్ మీట్‌ లో  నేను కొన్ని మాటలు మాట్లాడాను. కొన్ని విషయాల్లో బాధ కలిగించాను. త్వరలో మీ అందరికీ కరెక్ట్‌ విషయాల మీద బేషరతు క్షమాపణలు చెప్పబోతున్నాను. దయచేసి వేచి ఉండండి. థ్యాంక్యూ’’ అని వీడియోలో పేర్కొన్నారు.






ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో సాహిత్‌ మోత్కూరి తెరకెక్కించిన చిత్రం ‘పొట్టేల్‌’. అక్టోబర్ 25న ఈ సినిమా విడుదలైంది.  సినిమాపై కొంత మంది రివ్యూ రైటర్లు నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ లో శ్రీకాంత్ అయ్యంగార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలాన్ని ఉపయోగించారు. దరిద్రానికి విరోచనాలు అయితే రివ్యూ రైటర్లు పుడతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం షార్ట్ ఫిలిం తీయడం రాని వాళ్లు, సినిమా ఎలా రూపొందించాలో తెలియని వాళ్లు రివ్యూలు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. సినిమాల గురించి తెలియని వాళ్లు రివ్యూలు ఇవ్వడం మానేయాలన్నారు. శ్రీకాంత్ వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర దుమారం చెలరేగింది. ఆయనపై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు.



శ్రీకాంత్ పై మా అసోసియేషన్ కు ఫిర్యాదు


అటు శ్రీకాంత్‌ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలపై ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు ఫిర్యాదు చేశారు. రివ్యూ రైటర్ల మీద అడ్డగోలుగా వ్యాఖ్యలు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ‘‘ప్రసాద్‌ ల్యాబ్‌ లో జరిగిన ‘పొట్టేల్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌ లో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఫిల్మ్ క్రిటిక్స్ గురించి దారుణంగా మాట్లాడారు. సినిమా రివ్యూలు రాసే వారిపై పరుష పదజాలం ఉపయోగించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. శ్రీకాంత్‌ అయ్యంగార్‌ మాటలు ఫిల్మ్ క్రిటిక్స్ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం” అని ఫిల్మ్‌ క్రిటిక్స్ అసోసియేషన్‌ ప్రతినిధులు ఫిర్యాదులు వెల్లడించారు.     


వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో అయ్యంగార్


శ్రీకాంత్ అయ్యంగార్ ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. గత కొద్దికాలంగా విడుదలైన ప్రతి సినిమాలోనూ ఆయన కనిపిస్తున్నారు. ఆయన కనిపించిన సినిమాలు బాక్సాపీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లో అవకాశం కల్పిస్తున్నారు. సినిమాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ ఆయన ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. సినీ అభిమానులతో పాటు నెటిజన్లతో టచ్ లో ఉంటున్నారు. సినిమాలతో పాటు సామాజిక అంశాలపైనా స్పందిస్తున్నారు.   



Read Also: ప్రభాస్ స్వీట్ హార్ట్, మెగాస్టార్ వెరీ స్పెషల్, తెలుగు హీరోల గురించి సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్