ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి కనీసం రెండు సీట్లు సాధించాలని సవాల్ విసిరారు. అలా సాధిస్తే.. తాను చంద్రబాబు ఇంట్లో పాకీ పనిచేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా పోరాడి గెలిచే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవని ఎద్దేవా చేశారు. మిత్రపక్షం పేరుతో బీజేపీ, కమ్యూనిస్టు, జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని విమర్శించారు. తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను నారాయణ స్వామి ఖండించారు. తాను డబ్బు, పదవులకు లొంగే వ్యక్తిని కాదని, తాను అవినీతిపరుడని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని వెల్లడించారు. 


జగన్‌కి, చంద్రబాబుకి చాలా వ్యత్యాసం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబుకి చాలా వ్యత్యాసం ఉందని నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబు ఉన్న వాళ్ల కోసం తపన పడితే.. జగన్ లేని వాళ్ల కోసం తపన పడతారని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన బాబు.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. వీరిలో రెడ్లకు మాత్రమే పదవులు ఇచ్చారని.. ఒక్క ఎస్సీకి అయినా అవకాశం కల్పించారా? అని నిలదీశారు. ఎస్సీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మండిపడ్డారు. గతంలో తనను కూడా టీడీపీలోకి తీసుకునేందుకు బాబు బేరాలు ఆడించారని ఆరోపణలు చేశారు. తానెప్పుడూ నీతి, నిజాయితీతోనే ఉన్నానని వ్యాఖ్యానించారు. ఆ విషయం బాబుకు తెలుసు కాబట్టే తనపై విమర్శలు చేయరని అన్నారు. 


టీడీపీ కౌంటర్ ఎటాక్..
చంద్రబాబుపై మాటల యుద్ధానికి దిగిన నారాయణ స్వామిపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు మీద వ్యాఖ్యలు చేసే నైతిక హక్కు నారాయణ స్వామికి లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి విమర్శించారు. దళిత నాయకుడిగా ఉన్న నారాయణస్వామి.. సీఎం జగన్‌కి వంగి వంగి నమస్కరం చేసే వారని ఆరోపించారు. నారాయణ స్వామి ఆరోపణలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. అవినీతి పరులను కట్టడి చేయాలని తాను సూచిస్తే.. తమపైనే ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. కాగా, త్వరలోనే నారాయణ స్వామి అవినీతి చిట్టా బయటపెడతానని ఇటీవల సుధాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజులుగా నారాయణ స్వామి, టీడీపీ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది.


Also Read: YS Jagan Bail Live Updates: వైఎస్ జగన్ కడిగిన ముత్యంలా బయటకు రావాలి.. రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు


Also Read: Jagan CBI Court Verdict : నేడు జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు.. వైసీపీలో ఉత్కంఠ !