Kottu Satyanarayana: గతంలో టీడీపీ హయాంలో, బాబు పాలనలో మాఫియా, మైనింగ్, దోపిడీ విపరీతంగా జరిగాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఆదివారం శ్రీశైలంలో మీడియాతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ.. చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో మైనింగ్ పేరుతో ఇసుకపై కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా దోపిడీ చేశారని ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మాత్రం వైసీపీ హయాంలో ఇసుక అమ్మకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని చెప్పారు. అయితే రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతోందని, అక్రమ రవాణా చేస్తున్నారని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టు సత్యనారాయణ తెలిపారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో వందలాది కోట్ల రూపాయలు దోచుకుని చినబాబుకి, పెదబాబుకి వాటా వెళ్లిందని ఎమ్మెల్యేలే అప్పటో బహిరంగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయని కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు మాత్రం ఇసుక మైనింగ్ తో ప్రభుత్వానికి సంవత్సరానికి రూ. 700 కోట్ల నుండి రూ. 800 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు.


మీడియా సమావేశంలో జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆసక్తికర కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని కొట్టు సత్యనారాయణ సూచించారు. ప్రతిపక్ష నేతగా అవ్వడానికి పవన్ కళ్యాణ్ కు అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షం చనిపోయిందని.. ఎవరికీ ప్రజల నుండి గుర్తింపు కూడా లేదని అన్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాటలో వెళ్తే పవన్ కళ్యాణ్ జన్మలో ముందుకు వెళ్లలేరని కొట్టు సత్యనారాయణ తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లినా ఆయనకు ఎవరూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. బీజేపీ పెద్దలతో మాట్లాడేందుకు కూడా అవకాశం దొరకడం లేదని విమర్శలు గుప్పించారు. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. ప్రజలు అందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు. మరోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ధీమాగా చెప్పారు. 


టీడీపీకి దమ్ము, ధైర్యం ఉంటే తమకు ఇంకా సంవత్సర కాలం ఉందని, 19 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లి గెలవాలని కొట్టు సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ట్రైలర్, టీజర్ అంటూ టీడీపీ నాయకుడు పట్టాభిరామ్ మాట్లాడుతున్నారని, ఇటీవల గన్నవరంలో చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి చూసినా ఆయనకు బుద్ది రాలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటుటకు నోటుతో పారిపోయిన దొంగలు.. నలుగురు ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొని ఒక్క ఎమ్మెల్సీ గెలిచి ట్రైలర్ అంటున్నారని మండిపడ్డారు. 


మే 25వ తేదీన శ్రీశైలంలో  జరిగే కుంభాభిషేకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా క్యూ కాంప్లెక్స్ డిజైన్ అయితే సీఎం జగన్ చేతుల మీదుగా ఫౌండేషన్ వేయిస్తామని, గ్యాలరీ ఏర్పటు చేస్తామని కొట్టు సత్యనారాయణ తెలిపారు.