Jagananna Saswatha Bhu Hakku: రెండో దశ భూ హక్కు పథకాన్ని సంపూర్ణంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
భూ హక్కుపై సీఎస్ రివ్యూ...
రాష్ట్రంలో రెండవ దశ భూములు రీసర్వే చేపట్టిన 2వేల గ్రామాల్లో సెప్టెంబరు 30 నాటికి రీసర్వేను పూర్తి చేసి సరిహద్దు రాళ్లు పాతడంతో పాటు భూహక్కు పత్రాలు పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా కెఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న భూ హక్కు, రీసర్వే, ప్రయారిటీ భవనాలు, జగనన్నకు చెబుదాం అంశాలపై  సిఎస్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాంతో కలిసి సిఎస్ వీడియో సమావేశం నిర్వహించారు. రెండవ దశ భూముల సర్వే ప్రక్రియను పూర్తి చేసేందుకు ఒక టైం లైన్ ను పెట్టామని తెలిపారు. వచ్చే జూలై 31నాటికి విలేజ్ సర్వేయర్ లాగిన్ డేటా ఎంట్రీని ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు.  


ఆగస్టు 31 నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ ను పూర్తి చేసి పబ్లికేషన్ ను కూడా పూర్తి చేయాలని తెలిపారు. అదే విధంగా సెప్టెంబర్ 30 నాటికి రాళ్లు పాతడంతో పాటు భూహక్కు పత్రాల పంపిణీని కూడా పూర్తి చేయాలని చెప్పారు. అక్టోబరు 15 నుండి రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని సిఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. నిర్దేశించిన గడవు ప్రకారం ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిర్దిష్ట గడువు లోగా  పూర్తి చేసేందుకు కలెక్టర్, జేసీ స్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ ఆదేశించారు.


పవర్ పాయింట్ ప్రజంటేషన్... 
రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఏ  జి.సాయి ప్రసాద్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లాల వారీ భూహక్కు, రెండవ దశ భూరీ సర్వే జరుగుతున్న విధానాన్ని వివరించారు. ప్రతి రోజు  కలెక్టర్లతో మానిటర్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 2లక్షల మ్యుటేషన్లు 4లక్షల సబ్ డివిజన్లు జరిగాయని పేర్కొన్నారు. ఐదారు లక్షల సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ.. ఎన్ఆర్ఐలకు సంబంధించిన భూమి పత్రాలను డిజిటల్ రూపంలో పంపాలని సూచించారు.  రాష్ట్ర సర్వే మరియు సెటిల్మెంట్ శాఖ కమీషనర్ సిద్దార్థ జైన్ మాట్లాడుతూ  గతంలో సర్వే రాళ్ళను 13వ  నోటిఫికేషన్ అయ్యాక పాతేవారని కాని ఇప్పుడు ఆర్ఓఆర్ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా ఏక కాలంలోనే పాతాలని చెప్పామని ఇప్పటికే 700 లకు పైగా గ్రామాల్లో ఆర్ఓఆర్ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.


ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం..
జగనన్నకు చెబుదాం కింద వచ్చే ఫిర్యాదులను త్వరిత గతిన పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఆర్థికేతర అవసరాలకు సంబంధించిన అంశాలను సత్వరం పరిష్కరించాలని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్న నేపద్యంలో ప్రజల నుండి వచ్చే అర్జిలకు టాప్ ప్రయార్టి ఉండాలని, అర్జిదారుల సమస్యను పరిష్కరించటమే అంతిమ లక్ష్యంగా వ్యవహరించాలని అన్నారు.