YSRCP MLA Mustafa: ఎక్కడైనా తమను పట్టించుకోవాలని, తమ నియోజకవర్గం వైపు చూడాలని ప్రతిపక్ష నేతలు అడగటం చూస్తుంటాం. కానీ ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తనను పట్టించుకోవాలని, పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని.. మళ్లీ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుక్కోవాల్సి ఉంటుందని ముస్తఫా భావోద్వేగానికి లోనయ్యారు. 


గుంటూరు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం రెండో రోజు వాడివేడీగా జరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు చేతులు జోడించారు. గుంటూరు కార్పోరేషన్ అధికారిక సమావేశంలో అధికారులను ఉద్దేశించి ముస్తఫా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా చేశానని, అధికారులు తనను గుర్తించాలంటూ చేతులు జోడించి వేడుకున్నారు. పార్టీ మరోసారి గెలవాలంటే తాను మళ్లీ జనం వద్దకు వెళ్లి ఓట్లు అడుక్కోవాల్సి ఉంటుందని ప్రస్తావించారు. తాను సూచించిన పనులు అధికారులు పక్కన పెడుతున్నారని, తన మాటను లెక్క చేయడం లేదని భావోద్వేగానికి లోనయ్యారు. అభివృద్ధి పనులకు అధికారులు సహకరించకుండా తనను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


లక్ష రూపాయలు ఖర్చు చేసి కల్వర్టు నిర్మాణం చేయలేదని ఎమ్మెల్యే ముస్తఫా ప్రస్తావించారు. ఇప్పటికే చాలా కాలం వేచిచూశానని, తక్షణమే ఏఈని సమావేశానికి పిలించాలన్నారు. అప్పటివరకూ నగరపాలక సంస్థ సమావేశం నిలిపివేయాలని ఓ దశలో ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మీ అంతకు మీరే చేసుకోండి. అనుభవం ఉన్న ఎమ్మెల్యేను అయిన తనను పట్టించుకోవాలని చేతులు జోడించి వేడుకుంటున్న అన్నారు. జనాల వద్ద అడుక్కోవాల్సిన అవసరం రావొద్దంటే, అంతకుముందే మనమే పని చేసిపెట్టాలని కోరారు. జనం సమస్యలు చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయని, ఇది పద్దతి కాదంటూ వేడుకున్నారు. ఎంఎల్ఏ ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలతో పనులు కొనసాగిస్తూ ముస్తఫాను పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని, మేయర్ ను పదవి నుంచి తొలగించాలని ప్రయత్నాలు జరిగాయని సైతం స్థానికంగా చర్చ జరుగుతోంది.



రెండో రోజు శనివారం సమావేశంలోనూ టీడీపీ కార్పోరేటర్లు అభివృద్ధి చేయాలంటూ పట్టుపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్‌ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులోని పలు సర్కిల్స్‌ను అభివృద్ధి చేశారు కానీ కార్పొరేషన్ ఎందుకు ఎన్టీఆర్ సర్కిల్‌ను మాత్రం వదిలేసిందని టీడీపీ కార్పోరేటర్లు ప్రశ్నించారు. అన్ని వర్గాల వారిని జగన్ ప్రభుత్వం పట్టించుకుందని, అదే తీరుగా తన నియోజకవర్గంలో ఉన్న ఎన్టీఆర్ సర్కిల్‌ను అభివృద్ధి చేస్తానని  ఎమ్మెల్యే ముస్తఫా స్పష్టం చేశారు. నిధులు విడుదల చేసినప్పటికీ కాంట్రాక్టర్ పనులు సరిగా చేయడం లేదని చెప్పారు.


ఇటీవల గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు నిరసన సెగ తగిలింది. బ్రహ్మంగారి గుడి వీధిలో మురుకాల్వ శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే ముస్తఫాను ప్రజలు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలో భూగర్భ డ్రైనేజీ కావాలని స్థానికుల డిమాండ్ చేశారు. కాలువ నిర్మాణంతో రహదారులు మరింత తగ్గిపోతాయని ఆందోళన చేశారు. స్థానికులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ప్రజలకు చిరాకొచ్చి ఎమ్మెల్యేలేనే నాశనం అయిపోతారంటూ ఏకంగా శాపనార్థాలు పెట్టడం తెలిసిందే. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా వెళ్లిన సందర్భంలోనూ ఇదే తీరుగా పలు జిల్లాల్లో నిరసన వ్యక్తమవుతోంది. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial