YSRCP IPac :  ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ .. ఐప్యాక్ . ప్రశాంత్ కిషోర్ కు చెందిన   ఈ సంస్థ ఏపీలో వైఎస్ఆర్‌సీపీని మరోసారి గెలిపించే బాధ్యతలు తీసుకుంది. అందుకే రాష్ట్ర , నియోజకవర్గాల స్థాయిలో వివిధ దశల్లో టీములని ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా పార్టీ కి సంబంధించిన వ్యవహారం. కానీ ఈ టీములు ఇప్పుడు అధికారిక సమావేశాల్లో కూర్చోవడం కొత్త వివాదాలకు దారి తీస్తోంది. అధికారులు కూర్చునేచోట వారి మధ్యలో కూర్చుని  తమ పని చేసుకుంటున్నారు. ఇలా రావడం వివాదాస్పదమవుతుందని తెలిసినా వెనక్కి తగ్గడం లేదు. అసలు అధికారిక సమావేశాల్లో ఐ ప్యాక్ టీం సభ్యులు ఏం చేస్తారు ? ..


గుంటూరు కౌన్సిల్ మీటింగ్‌లో ఐ ప్యాక్ సభ్యులను గుర్తించడంతో కలకలం                               


గుంటూరు నగర పాలక సంస్థ సమావేశంలో ఐ ప్యాక్ సభ్యలను గుర్తించి  టీడీపీ సభ్యులు రచ్చ చేశారు. దీంతో వారిని బయటకు పంపేయాల్సి వచ్చింది. మామూలుగా విజిటర్స్ కూర్చునే దగ్గర వీరు కూర్చుంటే అడిగేవారుండరు. కానీ వారు నేరుగా అధికారులు కూర్చునే సీట్లలో కూర్చున్నారు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. టీడీపీ నేతలు గుర్తించడంతోనే విషయం బయటకు వచ్చింది. అది వైసీపీ సమావేశం కాదు. మరి వారికి అక్కడేం పని అన్నది చాలా  మందికి వచ్చే డౌట్. 


వైసీపీ నేతల పనితీరును అసెస్ చేస్తున్నారా ?                              


వైసీపీలో అన్ని స్థాయిలోనూ ఐ ప్యాక్ పర్యవేక్షణ  సొంత పార్టీ నేతలపై ఉంటుందని చెబుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతల పని తీరును గుర్తించడానికి ఇలా రెండో వ్యవస్థను వైసీపీ ఏర్పాటు చేసుకుందని చెబుతున్నారు. గుంటూరులో కార్పొరేటర్ల పని తీరుపై .. వారు ఇలా కార్పొరేషన్ మీటింగ్ లోనే కూర్చుని … నివేదికలు రాసుకుంటున్నారని అంటున్నారు. అయితే అది తప్పేమీ కాదు..వారి పార్ట ఇష్టం. కానీ ఇక్కడ నేరుగా అధికారికంగా వచ్చి కూర్చోవడమే అధికార దుర్వినియోగం జరిగిందన్న విమర్శలు రావడానికి కారణం.  ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ నేరుగా జోక్యం చేసుకోకకపోయినప్పటికీ ఆయన అనుంగు శిష్యుడు అయిన రిషిరాజ్.. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీలను డిసైడ్ చేస్తున్నారు. 



ఐ ప్యాక్ వ్యవహారంపై ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత    
ఐ ప్యాక్ సర్వేలు ఎప్పుడు ప్రారంభించిందో కానీ.. అరవై , డెభ్బై మంది ఎమ్మెల్యేలకు మార్చాలని రిపోర్ట్ ఇచ్చారంటూ ఓ ప్రచారం ప్రారంభమయింది. అందులో ఫలానా వాళ్లు ఉన్నారంటూ పేర్లు కూడా వచ్చాయి. ఇవి అఫీషియల్ కాదు. కానీ అది నిజమేనని నమ్మేంతగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇది పార్టీకి డ్యామేజ్ చేసిందని చాలా మంది ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే  ఇలాప్రచారం చేయడం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత  ఎక్కువగా ఉందన్న అభిప్రాయం కలిగేలా చేశారంటున్నారు. ఇటీవల ఆ సంఖ్యను పద్దెనిమిదికి పరమితం చేశారు.    ఐ ప్యాక్ టీంపై ...  వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్‌కు ఎవరెస్ట్ అంత నమ్మకం ఉంది. వారి నమ్మకం ముందు పార్టీ నేతల అసంతృప్తి చిన్నదే. అందుకే ఐ ప్యాక్ హవా వైఎస్ఆర్‌సీపీలో కొనసాగే అవకాశం ఎక్కువ ఉంది. 


అయితే  ఐ ప్యాక్ సిబ్బందిని అధికారిక విధుల్లో భాగం చేయాలనుకోవడమే వివాదాస్పదం అవుతోంది.