YS Jagan at Rapthadu: రాప్తాడు: ప్రజలే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు అని, తమ పాలనలో చేసిన సంక్షేమాన్ని అందరికీ వివరిస్తే చాలు మన ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan). సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, మరింత మేలు జరగాలంటే ప్రజలు వైసీపీ పక్షాన ఉండాలన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ (Rapthadu Siddham Meeting)లో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తుందని, అందులో మీ పిల్లలు 10 మంది శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు మీకు కనిపిస్తాయి. నాడు నేడుతో కొత్త రూపం మార్చుకున్న స్కూళ్లు, ఆసుపత్రులు కనిపిస్తాయని చెప్పారు. 


లంచం లేకుండా ప్రభుత్వ సేవలు.. 
ప్రతి 50, 60 ఇళ్ల వారికి సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థను తాము అందుబాటులోకి తెచ్చామన్నారు. రూపాయి లంచం లేకుండా ప్రభుత్వ సేవలు మీ ఇంటికే వస్తాయని వైసీపీ పాలనకు ముందు ఏపీ ప్రజలు ఊహించనే లేదన్నారు. 125 సార్లు బటన్ నొక్కి ఏకంగా రూ.2 లక్షల 55 వేల కోట్ల రూపాయాలు అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. వైసీపీ పాలనలో అభివృద్ధి ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తుందని.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తేనే ఇంత అభివృద్ధి జరిగిందని, మూడు, నాలుగు సార్లు ఛాన్స్ ఇస్తే ఇంకెంత డెవలప్ మెంట్ జరుగుతుందో ప్రజలు ఆలోచించుకోవాలని జగన్ సూచించారు.


నా మైనార్టీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు అంటూ అన్ని వర్గాల వారిని ఆదరించి.. వారికి పదవులు, హోదాలు ఇచ్చామన్నారు. ఎక్కడా వివక్ష లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేసి, అర్హులందరికీ లబ్ధిచేకూర్చామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకూ 4 లక్షల పోస్టులు ఉంటే.. నిరుద్యోగులకు 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. యువతకు న్యాయం, సామాజిక న్యాయం జరిగింది. దాదాపు 35 లక్షల ఎకరాలకు పైగా గిరిజనులు, రైతులు, నిరుపేదలకు వైసీపీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 


ప్రతి గ్రామంలో జగన్ మార్క్ కనిపిస్తుంటే, చంద్రబాబుకు ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలని ఈ వేదికగా జగన్ ప్రశ్నించారు. సొంతంగా నెగ్గలేక, ఊతకర్రలతో చంద్రబాబు తిరుగుతున్నారని సెటైర్లు వేశారు. జగన్ ను సొంతంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకనే పవన్ కళ్యాణ్ అనే ప్యాకేజీ స్టార్‌ను వెంట బెట్టుకుని చంద్రబాబు ఎన్నికలకు వెళ్తున్నారని చెప్పారు. మీకు ఇంకా మంచి జరగాలంటే.. 57 నెలల్లో 125సార్లు బటన్ నొక్కిన తమ సర్కార్ కోసం ప్రజలు రెండు బటన్లు (అసెంబ్లీ, పార్లమెంట్) నొక్కాలన్నారు.


గత ఎన్నికల్లో ఫ్యాన్ బటన్ నొక్కి వాళ్లను బంధించారు. ఈసారి టీడీపీకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ సైకిల్ ఎక్కుతుందని.. టీ గ్లాస్ పట్టుకుని మీ ఇంటికి వస్తుందన్నారు. తన పాలనలో ఏం చేశాడో చెప్పాలని వైసీపీ ప్రశ్నిస్తుంటే.. తాను సంసిద్ధం అని చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారని చెప్పారు. పేదల తరఫున మేం సిద్ధం అని వైసీపీ చెబుతుంటే, పెత్తందార్లకు మద్దతుగా తాను సంసిద్ధమని చంద్రబాబు స్లోగన్స్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. దుష్ట చతుష్టయం బాణాలకు బలైపోవడానికి తాను అభిమన్యుడ్ని కాదని, అర్జునుడ్ని అన్నారు. పేదవారే తనకు అండగా నిలిచి ఈ ఎన్నికల యుద్ధంలో విజయాన్ని అందిస్తారని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు.