Congress Govt failed to deliver on promises: హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తున్నదంటూ తెలంగాణ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) ఎద్దేవా చేశారు. మొన్నటివరకూ బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ మీద బురదజల్లిన బీజేపీ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ను హామీల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదని నిరంజన్ రెడ్డి నిలదీశారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఆలేరు మెడికల్ కాలేజీని కొడంగల్ కు తరలించడం కాదని, సీఎం రేవంత్ రెడ్డికి చేతనైతే కొత్త మెడికల్ కళాశాల కొడంగల్ లో ఏర్పాటు చేయాలని సవాల్ విసిరారు. ఉచిత బస్సు తప్ప 72 రోజులలో కొత్తగా రాష్ట్రంలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సమస్యలు, హామీలకు పరిష్కారం దొరకలేదని, కనీసం ప్రత్యామ్నాయం కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు.


కాంగ్రెస్ ఏం చేయనుందో ఒక్క ముక్కా చెప్పలేదు..
అసెంబ్లీలో ఎంతసేపూ గత ప్రభుత్వం (బీఆర్ఎస్ ప్రభుత్వం) ఏం చేసింది ? అని ప్రశ్నించారు. కానీ అంతకన్నా ఏం మెరుగ్గా చేస్తాం అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పకపోవడం విచారకరం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు సంబంధించి బడ్జెట్ లో సరిపడా కేటాయింపులు లేవని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 72 రోజులలోనే గ్యారంటీల అమలు సాధ్యం కాదని బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తేల్చిచెప్పిందన్నారు. మేడిగడ్డలో మూడు పిల్లర్ల కుంగుబాటును భూతద్దంలో చూపి గత ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల పాలనను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.


అందుకే హరీష్ రావుకు అడ్డంకులు
అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులు అడిగే ప్రశ్నలకు హరీష్ రావు జవాబులు చెప్పడాన్ని.. కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోయారని.. అందుకే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని విమర్శించారు. సాంప్రదాయాలకు భిన్నంగా ఇరిగేషన్ చర్చకు ఇతర శాఖల మంత్రులు స్పందించడం విడ్డూరంగా ఉందన్నారు. 15 నెలల కిందట హిమాచల్, 8 నెలల కిందట కర్ణాటకలో, 72 రోజుల కిందట 10, 5, 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమయిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. 


మళ్లీ మొదలైన కరెంట్ కోతలు
‘తెలంగాణ ప్రాంతంలో తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి కరంటు కోతలు మొదలయ్యాయి. మూడెకరాలకు మించి రైతుబంధు ఇంత వరకూ ఇవ్వలేదు. రైతుభరోసా అమలు చేస్తారా ? చేయరా ? ఇచ్చిన మాట ప్రకారం ఎకరాకు రూ.15 వేలు ఎప్పటినుంచి ఇస్తారో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయాలి. కాళేశ్వరాన్ని అడ్డు పెట్టుకుని హామీల అమలును తప్పించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉన్నది. ప్రభుత్వం మీ చేతిలోనే ఉన్నది. కాళేశ్వరంపై అత్యన్నతస్థాయిలో విచారణ జరిపించండి. ఏ చర్యకైనా, విచారణకైనా బీఆర్ఎస్ సిద్ధమని’ నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.


రైతులకు అన్యాయం చేయవద్దు
బీఆర్ఎస్ మీద కక్ష్యతో రైతులకు వచ్చే నీళ్ల విషయంలో అన్యాయం చేయవద్దు అని కాంగ్రెస్ నేతలకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లు, టన్నెళ్లను వాడుకునేందుకు అవకాశం ఉందని, ప్రభుత్వం ఈ విషయాలు పరిశీలించాలన్నారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ల సరఫరాపై రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. వాటి పేర్లు మారుస్తారా, లేక ఏం చేస్తారో అర్థం కావడం లేదన్నారు.  


ఆలేరు మెడికల్ కళాశాల కొడంగల్ కు తరలించడం పద్దతికాదని, చేతనైతే కొత్త మెడికల్ కళాశాల కొడంగల్ లో పెట్టాలని సవాల్ విసిరారు. వెనకబడ్డ కొడంగల్ అభివృద్దిని మేము ఖచ్చితంగా స్వాగతిస్తామన్నారు. వనపర్తి రాజులు కట్టిన సరళాసాగర్ ప్రాజెక్టు నిజాం రాజులు కట్టారని నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటారు. శబరి నదికి తెలంగాణకు, కాళేశ్వరానికి అస్సలు సంబంధం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలన్న దుగ్దతో మంత్రులు, కాంగ్రెస్ సభ్యులు ఏం మాట్లాడుతున్నారోనంటూ మండిపడ్డారు. 


కాంగ్రెస్ నేతల భౌగోళిక పరిజ్ఞానానికి దండాలు
‘తెలంగాణ ప్రతి ఇంచు మీద కేసీఆర్ గారికి అవగాహన ఉన్నది. అందుకే గత పదేళ్లలో తెలంగాణను అభివృద్ది చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు మీద ప్రజలకు ప్రభుత్వం జవాబు చెప్పాలి. రైతుబంధు, రైతుభీమా, నీళ్లు, కరంటు, వరి ధాన్యం, పంటల కొనుగోళ్లు, వరి ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ పై ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. వరి ధాన్యానికి రూ.500 బోనస్ విషయంలో మాటతప్పితే విడిచిపెట్టేది లేదని’ బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు.