YS Jagan instructions to YSRCP activists | తాడేపల్లి: ఏపీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు మంగళవారం (జూన్ 4న) జరగనుంది. అధికారంలోకి రావాంటే ముఖ్యమైన కౌంటింగ్ కు ముందురోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) వైసీపీ శ్రేణులకు సందేశాన్నిచ్చారు. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ అధినేత జగన్.. ఈ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ గొప్ప పోరాట స్ఫూర్తిని చాటారని కితాబిచ్చారు.


మంగళవారం (జూన్ 4న) జరగనున్న ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలని వైసీపీ శ్రేణులకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ సీపీకి వేసిన ప్రతి ఓటునూ మన పార్టీ ఖాతాలోకి వచ్చేలా అప్రమత్తంగా వ్యవహరించి, మరోసారి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఆకాంక్షించారు. 






లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్‌ పర్యటన ముగించుకుని రెండు రోజుల కిందట తిరిగొచ్చారు. జగన్ దాదాపు రెండు వారాలు విదేశీ పర్యటనలో ఉన్నారు. ప్రత్యేక విమానంలో విజయవాడలోని గన్నవరం చేరుకున్న జగన్‌కు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఏపీలో ఎన్నికలు పూర్తైన తర్వాత మే 17న జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. తన సతీమణి భారతి రెడ్డి, కుమార్తెలతో కలిసి లండన్, స్విట్జర్లాండ్‌లో ఫ్యామిలీతో సరదాగా గడిపారు. లండన్ పర్యటన నుంచి తిరిగొచ్చి తరువాత ఏపీ ఎన్నికల కౌంటింగ్ పై వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చేశారు. గత రెండు వారాలు రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై అధికారులను ఆరా తీశారు. మరోవైపు వైసీపీ నేతలతో సమీక్షలో భాగంగా కౌంటింగ్ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. 


అందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా సునామీలా తరలివచ్చిన వారికి జగన్ ధన్యవాదాలు తెలిపారు. మండటెండల్ని లెక్కచేయకుండా ఓట్లు వేసిన అవ్వతాతలకు,  అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములు, రైతన్నలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎన్నికల అనంతరం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటివరకు సాగిన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇచ్చారు. పార్టీ గెలుపుకోసం శ్రమించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.