Praggnanandhaa: వరుస విజయాలతో భారత చదరంగ కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడిస్తున్న ప్రజ్ఞానంద (Praggnanandhaa) పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. దిగ్గజాల చెస్‌ ఎత్తులను తన వ్యూహాలతో చిత్తు చేస్తూ ప్రజ్ఞానంద దూసుకుపోతున్నాడు. ఈ అనితర సాధ్య విజయాలతో భారత టీనేజ్‌ చెస్‌ సంచలనం ప్రజ్ఞానంద స్టార్‌గా మారిపోయాడు. ఎక్కడికి వెళ్లినా అభిమానుల కోలాహలం.. వారి మద్దతు, పరిమితులు లేని ప్రేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ప్రజ్ఞానంద ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అతడితో ఒక సెల్ఫీ అయినా తీసుకోవడం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. కేవలం క్రికెటర్లకు మాత్రమే ఉండే క్రేజ్‌... ఇప్పుడు ప్రజ్ఞానంద వశమైంది. తన పదునైన ఎత్తులతో ఇప్పుడు ప్రజ్ఞానంద సూపర్‌ స్టార్‌గా మారిపోయాడు.

 

నార్వేలో ఫ్యాన్స్‌ హంగామా
  

ఇండియన్‌ చెస్‌ సూపర్‌ స్టార్‌ ప్రజ్ఞానంద అనితరసాధ్య గెలుపులతో దూసుకుపోతూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. నార్వే చెస్ టోర్నమెంట్‌(Norway Chess 2024)లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రజ్ఞానంద స్టార్‌డమ్‌ మరింత పెరిగింది. జూన్ ఒకటిన జరిగిన క్లాసికల్ చెస్ గేమ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ ఫాబియానో కరునావాను ప్రజ్ఞానంద ఓడించడం చెస్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. నార్వే చెస్ పోటీలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ప్రజ్ఞానంద... ఒకే ఈవెంట్‌లో క్లాసికల్ ఫార్మాట్‌లో ప్రపంచ నంబర్  వన్‌ మాగ్నస్ కార్లసెన్, ప్రపంచ నెంబర్‌ టు ఫాబియానో కరునావాను ఓడించాడు. ఈ రెండు విజయాలతో ప్రజ్ఞానంద హీరోగా మారిపోయాడు. ఈ విజయాల అనంతరం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియో ప్రజ్ఞానందకు ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.  ఈ విజయం అనంతరం ప్రజ్ఞానంద ఓ స్వాగ్‌తో నడిచి వస్తున్న వీడియో సోషల్‌ మీడియాను కుదిపేసింది. నార్వే చెస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. అంతే ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది. ఒక స్వాగ్‌తో హీరోలా నడిచి వచ్చిన ప్రజ్ఞానంద అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి వారితో ఫొటోలు కూడా దిగాడు.  ఇవ్వడం మరియు వారితో సెల్ఫీల కోసం పోజులివ్వడం చూడవచ్చు. 

 

నార్వే ఏమని పోస్ట్‌ చేసిందంటే..

"ప్రజ్ఞానంద ఈజ్ బ్యాక్. అయిదో రౌండ్‌లో ప్రపంచ నంబర్‌ 2 ఫాబియానో కరువానాను ఓడించి యువ ప్రజ్ఞానానంద మళ్లీ చెస్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. రౌండ్ 3లో ప్రపంచ నంబర్‌ వన్‌ మాగ్నస్ కార్ల్‌సెన్‌ను ఓడించిన తర్వాత ప్రజ్ఞానంద నెంబర్‌ 2ను కూడా మట్టికరిపించాడు. తొలిసారిగా క్లాసికల్ చెస్‌లో టాప్‌ టూలోని ఇద్దరు ఆటగాళ్లను ఓడించి టాప్ 10లోకి దూసుకెళ్లిన భారత చెస్‌ చిచ్చరపిడుగుకు కృతజ్ఞతలు" అంటూ నార్వే ప్రజ్ఞానంద వీడియోను పోస్ట్‌ చేసింది. 

 

టాప్‌ 10లో ప్రాగ్‌

 ప్రజ్ఞానంద ఫిడే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ 10లోకి ప్రవేశించాడు. ఐదో రౌండ్‌లో ఫాబియానో కరువానాను ఓడించిన అనంతరం ఈ ఘనత సాధించాడు.