అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు మే 13న ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహించింది. పల్నాడు, అనంతపురం జిల్లా, చిత్తూరు, కడప జిల్లాల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఏపీలో ఈ ఎన్నికల్లో 81 శాతానికి పైగా పోలింగ్ జరిగిందని, పూర్తి లెక్కలు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 


సోమవారం జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా తనకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన అందరికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలిపారు. నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. వైఎస్సార్ సీపీ గెలుపు కోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటివరకు సాగిన మన సుపరిపాలన, మరింత మెరుగ్గా కొనసాగుతుందని హమీ ఇస్తున్నానని సీఎం జగన్ పోస్ట్ చేశారు.


 






అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన వైఎస్ షర్మిల
ఏపీలో జరిగిన ఎన్నికలపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ విధంగా స్పందించారు. గడిచిన కొన్ని వారాలుగా, పగలనకా, రేయనకా, కష్టాల కోర్చి, బాధలను మింగి, సవాళ్లకు ఎదురు నిలిచి, నన్ను నమ్మి, రాజశేఖర బిడ్డగా, మీ గొంతుగా తనను ఆదరించి, తన ఈ పోరాటంలో కలిసి నడిచిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల మహాయజ్ఞంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన ఓటరు మహాశయులకు, శాంతిభద్రతలు సజావుగా సాగేలా చూసిన పోలీసులకు, అనుచరులూ, అభిమానులూ, ఆప్తులు, స్నేహితులు, ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ షర్మిల తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.