KTR In Sircilla: కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు! ఎన్నికల్లో జాతీయ పార్టీల పరిస్థితి ఇదీ: కేటీఆర్

Shankar Dukanam Updated at: 14 May 2024 09:12 PM (IST)

Telangana News: తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టించాం, ఆ పార్టీల పరిస్థితి ఇదేనంటూ మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో కీలక వ్యాఖ్యలు చేశారు.

సిరిసిల్లలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

NEXT PREV

Telangana Loksabha Elections 2024 -సిరిసిల్ల: తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాల్లో కొన్ని చోట్ల బీజేపీ, కొన్ని చోట్ల కాంగ్రెస్ కు ధీటుగా పోటీ ఇచ్చామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక్క సీటు ఐనా వస్తుందా, అనే స్థితి నుంచి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ముచ్చెమటలు పట్టించామన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ప్రాంతీయ శక్తులే దేశంలో నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని, కాంగ్రెస్, బీజేపీకి మెజార్టీ రాదని జోస్యం చెప్పారు. ఎన్డీయే, I.N.D.I.A కూటమిలో లేని పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయి. గల్లీ దోస్తీ, ఢిల్లీ లో కుస్తీ.... రెండు జాతీయ పార్టీల పరిస్థితి ఇదన్నారు.


సిరిసిల్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బీజేపీని గెలిపిచేందుకు కిషన్ రెడ్డి కన్నా కూడా రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డాడు. నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి లాంటి ఆరేడు చోట్లు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్లను పెట్టింది. కేసీఆర్ బస్సుయాత్ర మొత్తం లోక్ సభ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసింది. 17 రోజుల బస్సుయాత్ర కాంగ్రెస్, బీజేపీలను గింగిరాలు తిప్పింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ లు దిగిరావాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం కనబడుతోంది. ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించాం.


కొత్త జిల్లాలను రద్దు చేయాలని, కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వందరోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేయడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రైతుబంధు, బోనస్, కరెంట్ విషయంలో రైతులు భగ్గున మండుతున్నారు. రుణమాఫీ విషయంపై తేదీలు మార్చుతున్నారు. 100 రోజుల్లో రూ. 2500 అని చెప్పి మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మహిళలకు 100 రోజుల్లోనే రూ. 2500, స్కూటీలు, తులం బంగారం ఇవ్వలేదు. నీళ్ల కోసం ప్రజలు రోడ్లెక్కుతున్నారు. ఫించన్ రూ. 4 వేలు అని చెప్పి జనవరి నెల రూ.2 వేలు ఎగగొట్టిండు. ఎటు చూసినా కాంగ్రెస్ పై వ్యతిరేకత, బీజేపీ మీద కూడా ప్రజల్లో సానుకూలత లేదని’ కేటీఆర్ పేర్కొన్నారు. 



పెట్రోల్, డిజీల్, నిత్యావసరాలు, సిలిండర్ ధరల పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. మేం సామాజిక న్యాయాన్ని పాటించాం. 12 జనరల్ స్థానాల్లో 50 శాతం బీసీలకే ఇచ్చాం. పోరాటే తత్వం ఉన్న వాళ్లకు మేము సీట్లు ఇచ్చాం. బీజేపీ, కాంగ్రెస్ లు మాత్రం పారాచ్యూట్ లీడర్లకు సీట్లు ఇచ్చారు. దీంతో వాళ్ల పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. గత ఐదు నెలల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ పాస్ చేసింది. కాళేశ్వరం, శ్వేతపత్రం, ఫోన్ ట్యాపింగ్ పేరుతో టైమ్ వేస్ట్ చేయడంతో వారిపై అసాధారణ వ్యతిరేకత వచ్చింది. ఇప్పటినుంచైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోతే దారుణమైన పరాభవం తప్పదు. కాంగ్రెస్, బీజేపీలు సన్నాయి నొక్కులు నొక్కుతూ, కేసీఆర్ ను తిట్టేందుకేనని ప్రజలు గ్రహించారు- కేటీఆర్


ప్రత్యర్థులు చేసిన దుష్రచారాన్ని తిప్పికొట్టి, అద్భుతంగా పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్ కు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేసులు పెడతానని బెదిరించినప్పటికీ, పార్టీ విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని కార్యకర్తల్ని అభినందించారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఆదరణతో పార్టీ పదికాలాల పాటు ఉంటుందన్న ఉత్సాహం జోష్ వచ్చిందన్నారు. ఎన్నికల్లో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.

Published at: 14 May 2024 09:12 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.