తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ పంచకట్టుతో తిరుమలేశుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో సీఎం పాల్గొన్నారు. తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం ప్రారంభించారు. అంతకు ముందు తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. అక్కడ నుంచి తిరుమల చేరుకున్న సీఎం పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో, మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు.
చిన్నపిల్లల గుండె ఆసుపత్రి ప్రారంభం
తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రి ఆవరణంలో ఏర్పాటుచేసిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఆసుపత్రి ప్రత్యేకతలపై రూపొందించిన మూడు నిమిషాల నిడివి గల వీడియోను ముఖ్యమంత్రి వీక్షించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతిలో చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని టీటీడీ ఏర్పాటు చేసింది. బర్డ్ ఆసుపత్రిలో మొదటి దశలో రూ.25 కోట్ల వ్యయంతో 50 పడకలతో ఆసుపత్రిని ఏర్పాటుచేశారు. ఇందులో ఓపీ బ్లాక్‌లో 5 కన్సల్టేషన్ గదులు, రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. రేడియాలజీ బ్లాక్‌లో ఎక్స్ రే రూమ్, క్యాథ్ ల్యాబ్, మరుగుదొడ్లతోపాటు రోగులు వేచి ఉండేందుకు ఏర్పాట్లు జరిగాయి. 15 పడకలతో ప్రీ ఐసీయూ బ్లాక్, 15 పడకలతో పోస్ట్ ఐసీయూ బ్లాక్, మూడు ఆపరేషన్ థియేటర్లు, 20 పడకలతో రెండు జనరల్ వార్డులు ఉన్నాయి. పరిపాలనా విభాగంలో కార్యాలయం, డాక్టర్ల గదులు, డైరెక్టర్ ఛాంబర్, సమావేశ మందిరం నిర్మించారు.
సప్తగోప్రదక్షిణ మందిరం ప్రారంభించిన సీఎం
తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద నిర్మించిన శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్దకు చేరుకున్న సీఎంకు టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి స్వాగతం పలికారు. గోసంరక్షణ లక్ష్యంగా అలిపిరి శ్రీవారి పాదాల వద్ద చెన్నైకి చెందిన దాత అందించిన రూ.15 కోట్ల విరాళంతో శ్రీ వేంకటేశ్వర సప్తగోప్రదక్షిణ మందిర సముదాయాన్ని టీటీడీ నిర్మించింది.
Also Read: రూ.5 కోట్ల కరెన్సీ నోట్లతో కన్యకా పరమేశ్వరి అలంకరణ.. రికార్డు బ్రేక్ చేసిన నెల్లూరోళ్లు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి