ఆంధ్రప్రదేశ్ లోని ఎంఎస్‌ఎంఈ, స్పిన్నింగ్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు రూ.1,124 కోట్ల ప్రోత్సాహకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఈ నిధులను విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ప్రకటించారు. కరోనా కష్టకాలంలోనూ వరుసగా రెండో ఏడాది పరిశ్రమలకు రాయితీలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా విపత్తు వల్ల రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా మూతపడకూడదనే లక్ష్యంతో గత ఏడాది మే 22న రీస్టార్ట్‌ ప్యాకేజీ ప్రకటించామని సీఎం జగన్ తెలిపారు. 




ఆర్థిక వ్యవస్థ బలోపేతం


ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుందని అందుకోసం అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించామన్నారు. పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం చేశామని సీఎం జగన్ గుర్తుచేశారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే రోడ్డున పడే పరిస్థితి ఉందన్న ఆయన ఎంఎస్‌ఎంఈలకు ఊతం అందిస్తే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెప్పారు. 






10 లక్షల ఉద్యోగాలు 


ఎంఎస్ఎంఈలతో 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడంతో వారిలో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలను ఆదుకుంటే ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో కొనుగోలు శక్తి లేనప్పుడు పారిశ్రామిక రంగం క్షీణిస్తుందన్నారు. అందువల్ల సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపడుతున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, ఉపాధిని నిలబెట్టేందుకు పథకాలు ఉపయోగపడ్డాయన్న ఆయన.. సంక్షేమ పథకాల అమలుతో కష్టాల్లోనూ పేదలను ఆదుకోగలిగామని సీఎం జగన్ తెలిపారు. 


Also Read: RRR Vs Ysrcp : సీపీఎస్‌పై జగన్ చెప్పాడంటే చేస్తాడంతే .. తేల్చేసిన రఘురామకృష్ణరాజు!


రూ.2 వేల కోట్లు ప్రోత్సాహకాలు


ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్స్‌ పరిశ్రమలతో 12 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ పరిశ్రమలకు రూ.1124 కోట్లు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.440 కోట్లు, టెక్స్‌టైల్, స్పిన్నింగ్‌ మిల్స్‌కు రూ.684 కోట్లు ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు ఇప్పటివరకు రూ.2,086 కోట్లు ప్రోత్సాహకాలు ఇచ్చామని తెలిపారు. ప్రోత్సాహకాలు పొందుతున్న పరిశ్రమల్లో 42 శాతం మహిళలు ఉన్నారని స్పష్టం చేశారు. 


 


Also Read: TN Assembly on Pawan Kalyan: పవన్ కల్యాణ్ ట్వీట్ పై తమిళనాడు అసెంబ్లీలో చర్చ... అధికారంలోకి రావడానికే రాజకీయం, వచ్చాక కాదు..