ప్రముఖ మోటార్ వాహనాల తయారీ కంపెనీ పియాజియో నుంచి ఏప్రిలియా, మోటోగజి సిరీస్‌లో కొత్త సూపర్‌బైక్‌లు భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఒకటి రెండు కాదు.. ఏకంగా 5 కొత్త మోడల్స్ ఎంట్రీ ఇచ్చాయి. ఏప్రిలియా ఆర్‌ఎస్ 660, ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4, టూనో 660, టూనో వీ4, మోటోగజి వీ85 టీటీ బైక్‌లను కంపెనీ రిలీజ్ చేసింది. ఎక్స్ షోరూం ధరల ప్రకారం.. ఈ సూపర్‌బైక్‌ల ప్రారంభ ధర రూ.13.09 లక్షలు కాగా.. హైఎండ్ వేరియంట్ ధర రూ.23.69 లక్షలుగా ఉంది.
టూనో 660 ధర రూ.13.09 లక్షలు కాగా.. ఆర్‌ఎస్ 660 బైక్‌ల ధర రూ.13.39 లక్షలుగా ఉంది. టూనో వీ4 ధర రూ.20.66 లక్షలుగా, ఆర్ఎస్‌వీ4 ధర రూ.23.64 లక్షలుగా నిర్ణయించారు. ఇక మోటోగజి వీ85 టీటీ ధర రూ.15.40 లక్షలుగా ఉంది. వీటిని కొనుగోలు చేయాలనుకునే వారు.. దేశవ్యాప్తంగా ఉన్న తమ మోటోప్లెక్స్‌లను సంప్రదించవచ్చని పియాజియో ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దైగో గ్రాఫీ వెల్లడించారు.
ఆర్‌ఎస్ 660, టూనో 660 ఫీచర్లు..
ఆర్‌ఎస్ 660, టూనో 660 బైకులలో 659 సీసీ పేరలల్ ట్విన్ ఇంజిన్ ఉండనుంది. ఆర్‌ఎస్ 660 ఇంజిన్ 10500 ఆర్‌పీఎం దగ్గర 99 బీహెచ్‌పీ పవర్.. 8500 ఆర్‌పీఎం దగ్గర 6.83 కేజీఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక టూనో 660 ఇంజిన్ 10500 ఆర్‌పీఎం దగ్గర 94 బీహెచ్‌పీ పవర్.. 8500 ఆర్‌పీఎం దగ్గర 6.83 కేజీఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఏప్రిలియాలు కూడా వేటికవే ప్రత్యేకమని కంపెనీ చెబుతోంది.
టూనో 660తో పోలిస్తే ఆర్ఎస్ 660 బాగా స్పోర్టియర్‌గా ఉంటుంది. ఈ రెండు బైకులలోనూ 15 లీటర్ల ఫ్యూయల్ ట్యాంకు ఉంటుంది. అలాగే ఇవి రెండూ 183 కేజీల బరువును కలిగి ఉంటాయి. ఆర్ఎస్ 660.. అపెక్స్ బ్లాక్, లావా రెడ్, ఏసిడ్ గోల్డ్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఇక టూనో 660.. కాన్సెప్ట్ బ్లాక్, ఇరీడియం గ్రే, ఎసిడిక్ గోల్డ్ రంగులలో లభించనుంది.
ఆర్ఎస్‌వీ4, టూనో వీ4 స్పెసిఫికేషన్లు..
ఆర్ఎస్‌వీ4లో 1099 సీసీ వీ4 మోటారు అందించారు. ఇది 211 బీహెచ్‌పీ పవర్, 12.75 కేజీఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక టూనో వీ4లో 1077 సీసీ వీ4 మిల్ ఉంటుంది. ఇది 170 బీహెచ్‌పీ పవర్, 12.4 కేజీఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, క్రూయిస్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, రైడింగ్ మోడ్స్, ఏప్రిలియా పెర్ఫార్మెన్స్ రైడ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Royal Enfield Classic 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వచ్చేసింది.. బుల్లెట్ బండి ధర ఎంతంటే?
Also Read: Indian Motorcycle Chief: ఇండియన్ 'చీఫ్' బైక్‌లు వచ్చేశాయి.. ఫీచర్లు అదుర్స్..