భారీ వర్షాలు, వరదలతో పలు జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నడూ లేనంతగా రాయలసీమలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. వరద బాధితుల్ని ఆదుకోవాలని, సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం జగన్ ఆదేశించారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటిని పరిష్కారించాలని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు వరద బాధితులకు అండగా నిలవాలని మంత్రులు, ఎమ్మెల్యేలను సీఎం జగన్ ఆదేశించారు.
Also Read: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలు
పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీల పూడికతీత పనులపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అప్పటికప్పుడు వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు. బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల పంపిణీ, వరద నష్టంపై అంచనాలు రూపొందించాలన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తిరిగి పంటలు సాగు చేసేలా విత్తనాలు, పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ బాధితులకు అండగా నిలవాలని సీఎం నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం లేదన్న సీఎం.. తమ ప్రాంతంలోనే ఉండి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు.
Also Read: ఏపీ వరద బాధితులకు అండగా ఉండండి... సహాయక చర్యల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ ట్వీట్
బాధితులకు ఉచితంగా నిత్యవసరాలు
వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. వరద బాధితుల్లో ప్రతీ కుటుంబానికి 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. వీటన్నిటిని కూడా బాధితులకు ఉచితంగా అందించాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఈ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు ప్రకటించింది. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 172 మండలాలపై వర్షాల ప్రభావం పడిందని వెల్లడించింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంది. వర్షాలు, వరదలతో ఇప్పటివరకు 24 మంది మృతిచెందారని తెలిపింది. మరో 17 మంది గల్లంతైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నాలుగు జిల్లాల్లో 23,345 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపింది. 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ₹7 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్