CM Jagan Delhi Tour : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దిల్లీలో పర్యటించనున్నారు. ఆదివారం దిల్లీ చేరుకోనున్న సీఎం జగన్, రేపు(సోమవారం) ప్రధాని మంత్రి మోదీతో భేటీ కానున్నారు. సీఎం జగన్ ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 7 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి దిల్లీకి బయలుదేరనున్నారు. ఆదివారం రాత్రి 9.15 గంటలకు దిల్లీ చేరుకుని జన్‌పథ్-1లో రాత్రి బస చేయనున్నారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం అవుతారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదలపై భేటీలో చర్చకు రానుంది. పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని సీఎం జగన్ కోరనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.
సీఎం జగన్ దిల్లీ టూర్
సీఎం జగన్ దిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. బీజేపీకి టీడీపీ దగ్గరవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్న సమయంలో సీఎం జగన్ ప్రధాని మోదీతో సహా అమిత్ షా భేటీ అవుతుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల నీతి అయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లి జగన్ ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో మరోసారి ప్రత్యేకంగా కలవాలని ప్రధానితో సీఎం చెప్పారు. దీంతో ఆదివారం సాయంత్రం సీఎం జగన్ దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారని సమాచారం. సీఎం జగన్ దిల్లీ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు.
రాష్ట్రపతితో భేటీ!
నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత బీజేపీకి వైసీపీ కీలకంగా మారింది. దీంతో ఈ రెండు పార్టీలు భవిష్యత్ రాజకీయాలపై దృష్టిపెట్టాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు వైసీపీ మద్దతు తెలిపింది. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడంతో ఆమె సీఎం జగన్ గౌరవ సూచకంగా కలవనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ధన్ కర్ తో సీఎం సమావేశం కానున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి జగ్ దీప్ ధన్ కర్ కు వైసీపీ మద్దతు తెలిపింది. దిల్లీ పర్యటనలో సీఎం జగన్ కీలక అంశాలపైన క్లారిటీ తీసుకోవాలని భావిస్తున్నట్లుగా పార్టీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సవరించిన అంచనాలకు ఆమోదంపైన ప్రధానితో చర్చించనున్నారు.
పొత్తుపై క్లారిటీ!
సీఎం జగన్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల దిల్లీ వెళ్లిన చంద్రబాబు ప్రధానితో కొద్దసేపు మాట్లాడారు. చంద్రబాబు మళ్లీ దిల్లీకి రావాలని ప్రధాని అన్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో బీజేపీ, టీడీపీ మళ్లీ జట్టుకడుతున్నాయని ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ అలెర్ట్ అయింది. సీఎం జగన్ దిల్లీలో పర్యటనలో ఈ విషయాలపై ఓ క్లారిటీకి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఏపీలో కొందరు బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తుంది. కేంద్రంలో బీజేపీకే సపోర్టు చేస్తున్న వైసీపీపై ఏపీ బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తు్న్న విషయాన్ని బీజేపీ కీలక నేతల దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ పొత్తు రాజకీయాల పైనా ఈ పర్యటనలో సీఎం జగన్ ఓ క్లారిటీ తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : Jr Ntr Meets Amit shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ, ఎందుకంటే?
Also Read : Nara Lokesh: పలాస పర్యటనలో ఉద్రిక్తత, పోలీసుల అదుపులో నారా లోకేశ్