CM Jagan Davos Tour : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దావోస్‌ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును సీఎం జగన్‌ కోరారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతు సడలించాలని కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ వేశారు. ముఖ్యమంత్రి హోదాలో దావోస్‌లో అధికారంగా పర్యటనకు వెళ్లనున్నట్లు కోర్టుకు తెలిపారు. విదేశాలకు వెళ్లేందుకు జగన్‌కు అనుమతిస్తే కేసుల విచారణలో జాప్యం జరుగుతుందని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు జగన్‌ దావోస్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. 


స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరిగే 52వ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్ ఈ నెల 22 నుంచి 26 వరకు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌ నాయకత్వంలోని ఏపీ నుంచి ఒక టీమ్ దావోస్ లో పర్యటిస్తుంది. ఈ బృందం ఏపీలో పెట్టుబడి అవకాశాలు ప్రపంచ దేశాల కంపెనీలకు తెలియజేసుందుకు ఈ సదస్సులో పాల్గొంటుంది. ఇక్కడి పురోగతిని సదస్సులో తెలియజేయనుంది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ దావోస్‌ సదస్సుకు సంబంధించిన లోగోను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల బుక్‌లెట్‌ను గురువారం ఆవిష్కరించారు. ఏపీ తరఫున పెవిలియన్‌ థీమ్‌ ఏర్పాటు చేసి, 18 అంశాలను ప్రదర్శిస్తామని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర ముఖ్యమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తామన్నారు. ఏపీలో అధికార వికేంద్రీకరణ అంశాన్ని దావోస్‌ వేదికగా కంపెనీలకు తెలియజేస్తామన్నారు.  దాదాపు 30 అంతర్జాతీయ కంపెనీలతో సమావేశం అవుతున్నామని మంత్రి తెలిపారు. సీఎం పర్యటనలో పాల్గొంటున్నందున పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిచ్చే విషయమై తక్షణమే నిర్ణయాలు తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందన్నారు. 


తొలిసారి దావోస్ కు సీఎం జగన్ 


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో తొలిసారిగా దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సారి ఇదే సదస్సుకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో పాటుగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన సీఎంలు, మంత్రులు హాజరు అవుతున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏటా దావోస్ లో జరిగే సదస్సుకు హాజరయ్యే వారు. దావోస్ కేంద్రంగా పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం అయ్యేవారు. ఆ సమయంలో దాని గురించి పెద్ద ఎత్తున ప్రచారం సాగేది. ఇప్పుడు సీఎం హోదాలో తొలిసారి సీఎం జగన్ పెట్టుబడుల సదస్సుకు వెళ్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఈ పర్యటన సీఎం జగన్, మంత్రి సమర్థతకు పరీక్షగా మారనుంది.


మే 22 నుంచి మే 26 వరకు పర్యటన


ఈ నెల 22 నుంచి మే 26 వరకు సీఎం జగన్ రెడ్డి దావోస్ పర్యటన ఉండనుంది. సీఎంతో పాటు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ  మిథున్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నతాధికారులు ఈ పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్ లో జరగబోయే దావోస్ ఎకనామిక్   ఫోరమ్ లో వందల సంఖ్యలో కంపెనీలు పాల్గొననున్నాయి. ఈ సదస్సులో కోవిడ్  ముందు ఉన్న  పరిశ్రమల పరిస్థితి కోవిడ్ తర్వాత పరిస్థితిపై చర్చ  జరుగుతుంది. రాబోయే కాలంలో పారిశ్రామిక మార్పులపైన కూడా చర్చ జరగనుంది.