CM Chandrababu Visits Budameru Gandi Area: ప్రకాశం బ్యారేజీలో బోట్లు వదిలిపెట్టిన వారిని వదిలిపెట్టమని.. కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) హెచ్చరించారు. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పదో రోజు పర్యటించారు. ఈ క్రమంలో గండ్లు పడిన తీరు, వరద ప్రవాహం గురించి అధికారులు ఆయనకు వివరించారు. గత ప్రభుత్వం బుడమేరు గట్లను పట్టించుకోలేదని.. కృష్ణా నదిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని చంద్రబాబు అన్నారు. భారీ వరదకు తోడు డ్రెయిన్లు పొంగి అన్నీ కలిసి ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేశాయని చెప్పారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ అధికారులు రేయింబవళ్లు కష్టపడి బుడమేరుకు పడిన మూడు గండ్లు పూడ్చారని.. డ్రోన్ల ద్వారా గండ్ల పూడ్చివేత పనులను పర్యవేక్షించామని తెలిపారు. గత ఐదేళ్లుగా బుడమేరు ఆక్రమణలకు గురైందని.. దాదాపు 6 లక్షల మంది జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని అన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గమైన పాలన వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. 










'వైసీపీ విషం చిమ్ముతోంది'


వరద బాధితులకు కొందరు ఆర్థిక సాయం చేస్తుంటే.. మరికొందరు ఆహార సాయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కానీ, వైసీపీ మాత్రం విషం చిమ్ముతోందని మండిపడ్డారు. ఓడిపోయారని ప్రజలపై కక్ష తీర్చుకోవాలనే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'కృష్ణాలో 11.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నప్పుడు నదిలో 3 బోట్లు వదిలిపెట్టారు. ఆ బోట్లు కౌంటర్ వెయిట్ కాకుండా కాలమ్‌ను ఢీకొట్టి ఉంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. ఆ బోట్లకు వైసీపీ రంగులు ఎందుకున్నాయి.?. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వరద ప్రాంతాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది కష్టపడి పనిచేశారు. ప్రాణ నష్టం బాగా తగ్గించగలిగాం. పైరింజన్ల సాయంతో ఇళ్లు శుభ్రం చేస్తున్నాం. వరదలపై యుద్ధం చేసి గెలిచాం. పాడైన ఇళ్ల సామగ్రి వివరాలు సేకరిస్తున్నాం.' అని పేర్కొన్నారు. ఆయన వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, ఎంపీ కేశినేని చిన్ని, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.






Also Read: AP Floods Donation: వరద బాధితుల కోసం విద్యుత్ ఉద్యోగులు భారీ విరాళం, సీఎం చంద్రబాబుకు చెక్కు అందజేత