Funny Memes and Jokes iPhone 16 series: ఐఫోన్ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 ఫోన్లు ఎట్టకేలకు వచ్చేశాయి. యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో ఇవి రూపొందినట్లు కంపెనీ తెలిపింది. అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచర్‌తో పాటు కొత్త బటన్లు ఈ ఫోన్లలో అమర్చడం విశేషం. అలానే ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో ఇది వచ్చింది.
ఇంకా ఈ ఐఫోన్ 16 మోడళ్లతో(ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్) పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్ 4, ఎయిర్‌పాడ్స్ ప్రొ 2లను కూడా విడుదల చేసింది కంపెనీ.'ఇట్స్ గ్లోటైమ్' పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ గ్యాడ్జెట్స్‌ను ఆవిష్కరించింది.
ఈ ఫోన్లను ఆవిష్కరించగానే వీటిపై రివ్యూలు సోషల్ మీడియాలో వచ్చేశాయి. యూజర్స్ ఈ ఫోన్ల ఫీచర్స్, డిజైన్ ఎలా ఉందో చెబుతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఈ ఐఫోన్ 16 మిక్స్డ్ రివ్యూస్‌ను అందుకుంది. కొంతమంది ఈ ఫోన్లు అద్భుతంగా ఉన్నాయని కామెంట్లు చేస్తుండగా, మరి కొంతమంది నెట్టింట్లో నెగటివ్ రివ్యూస్ ఇస్తూ సెటైర్లు వేస్తున్నారు. ఐఫోన్‌పై మీమ్స్‌తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Iphone 16 Social Media Memes : 'ఐఫోన్ 11, 12, 13, 14,15, XS అన్నీ ఒకేలా ఉన్నా'యంటూ స్పైడర్ మ్యాన్ సిరీస్ పిక్స్‌తో పోల్చారు ఓ యూజర్. "మేము ఈ ఏడాది కొత్త జనరేషన్ ఫోన్‌ను కొనాలనుకున్నాం. బిగ్గెస్ట్ డిస్ ప్లే, థిన్ డిజైన్ కాదు." అని మరో యూజర్ కామెంట్ చేశారు. "యాపిల్ ఎప్పుడు మళ్లీ మళ్లీ సేమ్ ప్రొడక్ట్ మాత్రమే విడుదల చేస్తుంది. తమ కస్టమర్స్‌ను మళ్లీ మళ్లీ అదే కొనేలా చేస్తూ ఉంటుంది.", "కెమెరా బట్‌ను నన్ను ఉలిక్కిపడేలా చేసింది.", "ఈ ఐఫోన్ 16 నన్ను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.", "కేవలం పేరు, ఏడాది మాత్రమే మారింది. అంతా ఒకేలా ఉంది.", "కేవలం సెపరేట్ కెమెరా బటన్ కోసం యాపిల్ మళ్లీ కొత్తగా ఫోన్‌ను లాంఛ్ చేసింది. నైస్.", "ఐఫోన్ 16 ప్రో ఇంకా వన్ ప్లస్ నోర్డ్ను బీట్ చేయలేకపోతోంది." అంటూ పలువురు యూజర్లు కామెంట్లు చేశారు.
IPhone 16 Prices : ఇకపోతే యాపిల్ లాంఛ్ చేసిన ఈ ఐఫోన్ 16 ధర రూ.79 వేల నుంచి ప్రారంభం అవుతుంది. ఐఫోన్ 16 ప్లస్ రూ.89,900 నుంచి అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్రో రూ.1.19 లక్షలుగా ఉంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ.1.44 లక్షల నుంచి అందుబాటులో ఉండనుంది. అయితే ఈ ఫోన్లన్నీ సెప్టెంబర్ 13 నుంచి ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 20 నుంచి విక్రయాలు మొదలు కానున్నాయి. కాగా, యాపిల్ ప్రతి ఏడాది తన కొత్త ప్రొడెక్ట్స్‌ను లాంఛ్ చేయగానే పాత ప్రొడక్ట్స్ ధరలను తగ్గించి, కొన్నింటిని నిలిపివేస్తుంటుంది. అలానే ఈ సారి కూడా చేసింది.