AP CM Chandrababu News - అమరావతి: దేశ వ్యాప్తంగా ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతించారు. లేకపోతే ఒక్క రాష్ట్రంలో ఎన్నికల వల్ల మరో రాష్ట్రంలో కేంద్రం నిధులపై ప్రభావం చూపుతుందన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని, మరో ఏడుగురు కేంద్ర మంత్రులను కలిసి ఏపీ అభివృద్ధికి సహకారంపై చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విభజన కంటే విధ్వంసక పాలనతోనే ఏపీ తీవ్రంగా నష్టపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి విధ్వంసకర శక్తిగా మారితే రాష్ట్రం ఎలా మారుతుందో చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ఒక కేస్ స్టడీగా మారిందన్నారు. దాంతోపాటు ఎన్డీఏ సుపరిపాలనతో లాభాలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలన్నారు.
ఉండవల్లిలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇది చారిత్రాత్మక విజయం, ఇందులో ఏ సందేహం లేదు. ఎంతో దుష్ప్రచారం జరిగినా, ప్రధాని మోదీ పనితీరు, జేపీ నడ్డా కృషితో హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ తో చారిత్రాత్మక విజయం సాధించింది. మంచిపనులకు ఫలితం 90 సీట్లలో 48 సీట్లు నెగ్గారు. బీజేపీకి 39.94 శాతం ఓట్లు వచ్చాయి. గత ఎన్నికలకు కంటే ఇది ఎక్కువ. అంటే ప్రజల్లో పార్టీ కార్యక్రమాలు, సుపరిపాలనపై నమ్మకం పెరిగింది.
జమ్మూకాశ్మీర్ లో బీజేపీ బలమైన శక్తిగా మారింది. 25 సీట్లు నెగ్గగా, ఓట్ల శాతం 25.64 అని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ కు 43 సీట్లు రాగా, ఓటింగ్ శాతం 23.4. ఎన్సీ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం సంతోషదాయకం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో మంచి ఫలితాలు వచ్చాయి. రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని నమ్మకం కలిగింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆవశ్యకతను గుర్తించాలి
పార్లమెంట్ ఎన్నికల తరువాత జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను అంతా అర్థం చేసుకోవాలి. పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించి దేశ వ్యాప్తంగా అభివృద్ధిపై ఫోకస్ చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఓ రాష్ట్రంలో ఎన్నికలు అంటే మరో రాష్ట్రంలో అభివృద్ధి నిలిచిపోతుంది. ఏదో ఒక సీటుకు బై ఎలక్షన్ వస్తే.. పాపులారిటీ తగ్గిందంటూ ప్రచారం జరుగుతుంది. ప్రపంచంలో భారత్ ను అగ్రదేశంగా నిలిపేందుకు ప్రధాని మోదీ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి. విదేశాలు సైతం భారత్ చేపట్టిన కార్యక్రమాలను అనుసరిస్తున్నాయి. 5వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ, మోదీ పాలనతో త్వరలోనే మూడో స్థానానికి వస్తుంది. విజన్ వికసిత్ భారత్ 2047తో భారత్ తొలి లేక రెండో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని’ దీమా వ్యక్తం చేశారు.
మనం మరింతగా కృషి చేస్తే ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారే అవకాశం ఉందన్నారు. సుపరిపాలన, పారదర్శకతతో భారత్ అభివృద్దిలో దూసుకెళ్తుందన్నారు. భారత్ కు మ్యాన్ పవర్ ప్లస్ అవుతుందని, యువత మనకు అధికంగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు కావొస్తుండగా 2047లో భారత్ ప్రపంచంలోనే అగ్రదేశంగా, సుస్థిరమైన వ్యవస్థగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read: వరద సాయంపై అదేపనిగా వైసీపీ తప్పుడు ప్రచారం - ఖర్చు వివరాలు రిలీజ్ చేసిన మంత్రులు