AP CM Chandrababu Naidu : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు రెండో రోజు ఢిల్లీ పర్యటనలో అమరావతి నిధులపై దృష్టి పెట్టారు. ప్రపంచబ్యాంక్ లోన్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆ లోన్ నిధులు వచ్చే లోపు అడ్వాన్సుగా కేంద్రం నిధులు మంజూరు చేసేలా కేంద్ర మమంత్రులతో చర్చించారు. అమరావతికి రోడ్డు, రైలు కనెక్టివిటీ పై కేంద్ర మంత్రి గడ్కరీతో చంద్రబాబు చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి – హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి-రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలో సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి వచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్ (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్)లో విలీనం చేయడంపై చంద్రబాబు, కుమారస్వామి మధ్య కీలక చర్చ జరిగింది. సెయిల్ లో విలీనం అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి, కార్మికుల స్థితిగతులు మెరుగవ్వాలనే విషయాన్ని చంద్రబాబు కేంద్రమంత్రి కుమారస్వామికి తెలిపారు. కార్మికుల త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేస్తే.. ఏపీ ప్రజల మనోభావాలు దెబ్బతినే అవకాశముందని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు. ఢిల్లీకి వచ్చిన సోమవారం రోజే ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లవంతమైన చర్చలు జరిగాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు సవరించిన వ్యయ అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రధానికి వివరించానని రాసుకొచ్చారు.