CM Chandrababu Kuppam Tour: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) చిత్తూరు జిల్లా కుప్పం (Kuppam) నియోజకవర్గంలో మంగళవారం పర్యటిస్తున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం సొంత నియోజకవర్గానికి తొలిసారిగా వచ్చిన ఆయనకు.. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం శాంతిపురం మండలం జెల్లిగానిపల్లెకు వెళ్లిన సీఎం.. హంద్రీనీవా కాల్వ (Handrineeva Canal) పనులను పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితిని ఆయనకు అధికారులు వివరించారు. వివరాలు తెలుసుకున్న చంద్రబాబు త్వరగా కాలువ పనులను ప్రారంభించాలని ఆదేశించారు.



కాగా, కుప్పంలో మంగళ, బుధవారాల్లో సీఎం పర్యటన కొనసాగనుంది. బుధవారం ఉదయం ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు డిగ్రీ కళాశాలలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం పీఈఎస్ ఆడిటోరియంలో నిర్వహించే సమావేశంలో ఆయన మాట్లాడతారు. అటు, సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.


'కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా'


 కుప్పం నియోజకవర్గం ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని.. మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని సీఎం చంద్రబాబు అన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాను ఇక్కడకు వచ్చినా.. రాకున్నా ఆదరించారని.. ఇప్పటివరకూ 8 సార్లు తనను గెలిపించారని అన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించిన ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నామని చెప్పారు. 'నా రాజకీయాలకు కుప్పం నియోజకవర్గం ప్రయోగశాల. వెనుకబడిన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే కుప్పంను ఎంచుకున్నా. చిత్తూరు జిల్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రజల రుణం తీర్చుకుంటా. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తాం. ఏ తప్పూ చేయకున్నా 30 మంది కార్యకర్తలను జైల్లో పెట్టారు. ప్రశాంతమైన కుప్పంలో రౌడీయిజం చేసే వారికి అదే కడపటి రోజు.' అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.


ఇవాళ్టి నుంచే పనులు ప్రారంభం


గత ఐదేళ్లుగా కుప్పంలో ఎలాంటి అభివృద్ధి పనులూ జరగలేదని.. ఇవాళ్టి నుంచే అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు. 'ప్రతీ గ్రామంలోనూ తాగునీరు, డ్రైనేజీలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మళ్లీ మినరల్ వాటర్ అందిస్తాం. కుప్పంలోని నాలుగు మండలాలను ఆదర్శ పట్టణాలుగా అభివృద్ధి చేస్తాం. కుప్పం నుంచి ఎయిర్ కార్గో ద్వారా స్థానిక ఉత్పత్తులను విదేశాలకు పంపిస్తాం. పాడి, కోళ్ల పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తాం. తేనె ఉత్పత్తి మరింత పెరిగేలా చర్యలు చేపడతాం. కుప్పం బస్టాండ్, డిపో రూపురేఖలు మార్చి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాం. కుప్పం భవిష్యత్‌లో రైల్వే జంక్షన్‌లా మారే అవకాశం ఉంది. ఏ కుటుంబంలోనూ పేదరికం ఉండకూడదనే లక్ష్యంతో పని చేస్తాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.


Also Read: Hanuma vihari Meets Lokesh : పూర్తి స్థాయిలో న్యాయం చేస్తాం - హనుమ విహారికి లోకేష్ సపోర్ట్