CM Chandrababu Comments On AP Debts: ఏపీ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లని.. కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రావాలని తేల్చుతామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. బడ్జెట్‌పై శుక్రవారం ఆయన అసెంబ్లీలో (AP Assembly) ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. 'ప్రధాని మోదీ, పవన్, ప్రజలు నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. దాన్ని నిలబెట్టుకునేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే.. జగన్ ఐదేళ్ల విధ్వంసం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. 2014లో లోటు కరెంట్ సమస్యను అనేక విధానాలతో మిగులు కరెంట్ పరిస్థితికి తెచ్చాం. రాష్ట్రంలో సరికొత్త ఆర్థిక వ్యవస్థకు శ్రీకారం చుట్టాం. అమరావతి రైతులు ఎంతో నమ్మకంతో భూములు ఇచ్చారు. 2019లోనూ విజయం సాధించి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది. ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్నే విధ్వంసం చేశారు. గత ప్రభుత్వం జీవోలను సైతం ఆన్‌లైన్‌లో ఉంచలేదు. భావి తరాలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతాం.' అని పేర్కొన్నారు.






'ఆర్థిక ఉగ్రవాదం సృష్టించారు'


'గత ప్రభుత్వం ఆర్థిక ఉగ్రవాదం సృష్టించింది. ప్రజలు నమ్మి ఓట్లేస్తే దుర్మార్గంగా ప్రవర్తించారు. సంపద సృష్టించే ఒక్క పని కూడా గత ప్రభుత్వం చేయలేదు. పెట్టుబడులు పెట్టేందుకు వస్తే తరిమేశారు. రూ.431 కోట్లతో రుషికొండ ప్యాలెస్ నిర్మించారు. రూ.700 కోట్లతో సర్వే రాళ్లపై బొమ్మలు వేశారు. సాక్షికి రూ.400 కోట్ల ప్రకటనలు ఇచ్చారు. రూ.500 కోట్లు ఖర్చు చేసుంటే రోడ్లు బాగయ్యేవి. ఇప్పటివరకూ రూ.9,74,556 కోట్ల అప్పు తేలింది. గత ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోలను ఆన్‌లైన్‌లో పెట్టాం. ఇసుకను మేము ఉచితంగా ఇస్తే.. గత ప్రభుత్వం టన్ను రూ.475కి విక్రయించింది. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ పెట్టుబడులు రాలేదు. పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లాయి. నా దగ్గర డబ్బులు లేవు.. కానీ నూతన ఆలోచనలు ఉన్నాయి. వాటితోనే సంపద సృష్టించి పేదలకు పంచుదాం. ఏడాదికి రూ.33 వేల కోట్ల పింఛన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీ. ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నాం. 64.50 లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇస్తున్నాం.' అని సీఎం తెలిపారు.


'పేదలకు ఇల్లు కట్టిస్తాం'


పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమి ఇచ్చి ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. డిసెంబరులో లక్ష ఇళ్లల్లో గృహ ప్రవేశాలు చేసేలా కార్యాచరణ చేస్తున్నామని చెప్పారు. 'నక్కపల్లి, కొప్పర్తి పారిశ్రామిక జోన్లకు రూ.10 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. రాష్ట్రం మొత్తం బడ్జెట్ రూ.2.94 లక్షల కోట్లు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఓ మంచి బడ్జెట్ తీసుకురాగలిగాం. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా కృషి చేస్తున్నాం.' అని పేర్కొన్నారు.


Also Read: Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !