Chintakayala Vijay CID :   తెలుగుదేశం పార్టీ యువనేత చింతకాయల విజయ్‌కు సీఐడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.  సోషల్‌ మీడియాలో పోస్టుల వ్యవహారంలో మార్చి 28వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు నర్సీపట్నంలోని ఆయన నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. అయితే.. విజయ్‌ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన తండ్రి, టిడిపి సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడికి అందజేశారు.  ఈ నోటీసులు తీసుకున్న అయ్యన్నపాత్రుడు కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఇలా నోటీసులు ఇస్తున్నారన్నారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకే బీసీలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రజా అధికారంతో ఇంకెన్నాళ్ళు బీసీల గొంతు నొక్కుతారని మండిపడ్డారు.


భారతీ పే పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కేసులు 


గత ఏడాది అక్టోబర్ 1న క్రైమ్ నెంబర్ 14/2022 తో కేసు నమోదయింది.  దీని పైన విజయ్ న్యాయస్థానం ఆశ్రయించారు. దూకుడైన చర్యలు తీసుకోవద్దని విచారణ చేయాలంటే నోటీసులు జారీ చేయాలని కోర్టు సూచించింది. దీంతో నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికే  ఈ కేసులో ఒక సారి  చింతకాయల విజయ్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.  ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఐటీడీపీ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ ట్వీట్లు చేశారని.. ఈ వ్యవమారం వెనుక చింతకాయల విజయ్‌ పాత్ర ఉన్నట్లు సీఐడీ కేసులు పెట్టింది.  ఆయనపై సీఐడీ క్రైమ్‌ నంబర్‌ 14/2022 ఐపీఎసీ సెక్షన్లు 419, 469, 153–ఎ, 505(2), 120–బి రెడ్‌విత్‌ 34, ఐటీ చట్టం సెక్షన్‌ 66(సి) కింద కేసు నమోదు చేశారు.


హైదరాబాద్‌లోని విజయ్ ఇంట్లో సీఐడీ వివాదాస్పద ప్రవర్తన              


 ఆ తర్వాత కొద్దిరోజులకు ఏపీ సీఐడీ సీఐడీ అధికారులు హైదరాబాద్‌లోని విజయ్ నివాసంలో గందరగోళం సృష్టించారు.  పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారన్న ఆరోపణలు వచ్చాయి. చింతకాయల విజయ్ పిల్లలను ప్రశ్నించి వారి ఫోటోలు తీసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.  అయితే సీఐడీ పోలీసులు ఎలాంటి అలజడి సృష్టించలేదని..  ఓ కేసులో నోటీసులు ఇవ్వడానికి వెళ్లారని సీఐడీ తెలిపింది.   విజయ్‌ ఇంట్లో లేకపోవడంతో నోటీసులు ఇచ్చామన్నారు.  


ఏపీ సీఐడీ తీరుపై టీడీపీ నేతల తీవ్ర విమర్శలు


తెలుగుదేశం పార్టీ సో,ల్ మీడియా కార్యకర్తలను వేధించడానికి  మాత్రమే సీఐడీని ఉపయోగిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.  ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పెట్టారని.. అంటున్నారు. అక్రమ అరెస్టులు చేసి పోలీసులు కొట్టారని గుర్తు చేస్తున్నారు. సీఐడీ ఎన్ని కేసులు పెట్టినా కనీసం చార్జిషీట్లు దాఖలు చేయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కారణం ఏదైనా  సీఐడీ పోలీసులు ఇలా సోషల్ మీడియా కేసులకే ... అదీ కూడా టీడీపీ నేతలపై కేసులకే ప్రాధాన్యమిస్తూండటం.. ఇతరులు  ఇచ్చే ఫిర్యాదులను పట్టించుకోకపోవడం వివాదాస్పదమవుతోంది.