Andhra Pradesh Elections 2024: ఏపీలో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అదే సమయం నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఫోన్ లకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.


ఇప్పటివరకూ ఎంత సీజ్ చేశారంటే.. 
మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏపీలో రూ 269.28 కోట్లు నగదు, మద్యం, ఆభరణాలు సీజ్ చేసినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ నియోజకవర్గాలకు మే 13న నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం మొత్తం 1,06,145 మంది పోలీసులు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటున్నారని తెలిపారు. మొత్తం 46,389 పోలింగ్ స్టేషన్లలో 12,438 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు.


ఏపీలో పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 13న పోలింగ్‌ నిర్వహించనుంది. ఈ ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 175 నియోజకవర్గాలకుగానూ 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాలైన పాడేరు, అరకు, రంపచోడవరం స్థానాల్లో సాయంత్రం 4గంటల వరకు, కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చిన వారిని ఓటింగ్ కు అమమతిస్తామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 


ఏపీ ఎన్నికల విధుల్లో 5.26 లక్షల సిబ్బంది..
ఏపీలో 5.26 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. వీరిలో 3.30 లక్షల మంది పోలింగ్‌ విధులు నిర్వహించనుండగా.. 1.14లక్షల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనంగా మరో 10వేల మంది సెక్టార్‌ అధికారులు ఉంటారు. 8,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్‌వోలు విధులు నిర్వర్తించనున్నారని ఈసీ తెలిపింది. ఏపీలో పురుష ఓటర్లు 2,03,39,851 మంది ఉండగా, మహిళా ఓటర్లు 2,10,58,615 మంది ఉన్నట్టు ఈసీ తెలిపింది. థర్డ్‌ జెండర్‌ ఓటర్లు 3,421, సర్వీసు ఓటర్లు 68,185 ఉన్నారు. మే 13న ఏపీలో ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్‌ కేంద్రాలలో 1.6లక్షల ఈవీఎంలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మెడికల్‌ కిట్లు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.


ఆదివారం (మే 12న) సాయంత్రానికి సిబ్బంది పోలింగ్‌ బూత్‌లకు చేరుకుని, మే 13న ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని, అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటరు ఎవరైనా పోలింగ్ ఏజెంట్‌గా ఉండవచ్చు. పోలింగ్ రోజు 200 మీటర్ల దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చేయవచ్చు అని, స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదని ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. తెల్లటి స్లిప్పులపై ఓటరు పేరు, సీరియల్ నెంబరు ఉండవచ్చని, ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు, తిరిగి తీసుకెళ్లకూడదని చెప్పారు. పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ మూడు వాహనాలు అనుమతిస్తారని, పోలింగ్ బూత్‌లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదని తెలిపారు.