AP Cabinet: అమరావతి రాజధానిలో మరో 44వేల ఎకరాల సేకరణకు మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   అధ్యక్షతన కేబినెట్‌  సమావేశం అయింది.   రాజధాని రెండో విడత భూసేకరణను ఆమోదించింది. సీఆర్డీఏ పరిధిలో కొత్తగా తీసుకునే భూముల్లో ప్రభుత్వానికి సంబంధించి... 2019కు ముందు ఆరేళ్ల అనుభవ దారు ఎవరు ఉంటారో వారికే నష్టపరిహారం ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. 

స్వర్ణాంధ్ర P4పై త్వరలో కమిటీలు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  అలాగే టెన్నిస్ ప్లేయర్ సాకేత్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వనున్నారు.  తెలంగాణ కేబినెట్‌లో బనకచర్లపై వాళ్లు డిస్కస్ చేశారని చంద్రబాబు మంత్రులకు తెలిపారు.  తెలంగాణ వాడుకోగా మిగిలిన నీళ్లను మాత్రమే ఏపీ వాడుకుంటుందని   సీఎం చంద్రబాబు తెలిపారు.  తెలంగాణ నేతలు బనకచర్లపై రాజకీయం చేస్తున్నారని.. వరద జలాలను మనం వాడుకుంటామని.. ఈ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి నేతలు చెప్పాలని సూచించారు. 

పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌పై మనం దశల వారిగా ముందుకు వెళ్తామని... ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ఏం చెబుతుందో దాని ఆధారంగా మనం నిర్ణయం తీసుకుందామన్నారు.  ఎప్పుడూ శంకుస్థాపన చేస్తామనేది త్వరగా నిర్ణయించాలని మంత్రి లోకేష్ కోరారు.  పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌కి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కూడా అవసరమని..కేంద్రం ద్వారా ఓ సమావేశం ఏర్పాటు చేద్దామని  చంద్రబాబు చెప్పారు.  సున్నితమైన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్‌పై నేతలు పూర్తి అవగాహనతో జాగ్రత్తగా మాట్లాడాలని  చంద్రబాబు మంత్రులకు సూచించారు. 

రెవెన్యూ సమస్యలను ఏడాదిలోపు పరిష్కరించాలన్నారు.  ఎక్కువగా రెవెన్యూ సంబంధిత సమస్యలు వస్తున్నాయని వాటిని పరిష్కరించాలన్నారు.  అన్నక్యాంటీన్లను ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేయాలని నిర్దేశించామని..  అన్న క్యాంటీన్లను మానిటర్ చేయడానికి, ఎవరైనా విరాళాలు ఇస్తే తీసుకోవడానికి ఒక కమిటీ ఉండాలన్నారు.  అనకాపల్లిలో ఆర్సెల్ మిట్టల్ స్టీల్‌కు సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసే విధంగా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు 

ధరల స్థిరీకరణ నిధి ద్వారా పొగాకు, మామిడి, కోకో పంటల రైతులను ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉందనే కారణంతో పోగాకుకు మార్కెట్‌లో డిమాండ్ తక్కువ ఉన్నా మనం చొరవ తీసుకుని రైతులను ఆదుకుంటున్నామని అన్నారు. చేసిన మంచిని చెప్పుకోవటంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని వివరిస్తూనే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతును ప్రోత్సహించాలని సూచించారు. డిమాండ్‌కు తగ్గట్లుగా వాణిజ్య పంటలు వేసేలా రైతులను చైతన్య పరచాలని అన్నారు. 

అమరావతిలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వ పరంగా కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని అనుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో 6497 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తామని అన్నారు. టెంపుల్ టూరిజంతో పాటు ఏపీలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.   జులై 1వ తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరిగి వివరించాలని నిర్దేశించారు సీఎం చంద్రబాబు. కూటమిలోని అన్ని పార్టీల నేతలను కలుపుకొని ముందుకు వెళ్లాలని కోరారు.