BJP Vishnu Meet AP CM: మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు కూటమి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు  పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి .. ఏపీ సీఎం అధికార నివాసంలో చంద్రబాబును మర్యాదపూర్వకంగాకలిశారు.               

ఇటీవల 75వ జన్మదినం జరుపుకున్న ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రజా జీవితంలో 20 సంవత్సరాల విశిష్ట సేవలను విశ్లేషించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆయనకు బహూకరించారు.  మే 2న ప్రధాని మోదీ గారి అమరావతి పర్యటనలో భాగంగా దాదాపు రూ.50 వేల కోట్ల నిధులతో ప్రారంభం కాబోతున్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలకు ఎంతో శుభసూచకమై ఉంటాయని విష్ణువర్ధన్ రెడ్డి మీడియాకు చెప్పారు.  అమరావతిని ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వప్న నగరంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి పట్టుదలతో పాటు, ప్రధానమంత్రి మోదీ గారి సహకారం కూడా కీలకంగా ఉందన్నారు. 

అలాగే ముఖ్యమంత్రి గారు ఇటీవల ప్రవేశపెట్టిన P4 పథకం పేదల అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం ధనవంతుల సహకారంతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడిందని పేర్కొన్నారు. ఇది పేదరిక నిర్మూలనలో గేమ్ ఛేంజర్ అవుతుందని అభిప్రాయపడ్డారు.                                  

బీజేపి, మరియు  కేంద్ర ప్రభుత్వ సహకారం నేడు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని , రానున్న రోజుల్లో ఇది ఇంకా మరింత వేగంగా అభివృద్ధి ముందుకు సాగుతోందని అని  ఆయన పేర్కొన్నారు.                                     

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఈ క్రమంలో .. అధ్యక్ష పదవి రేసులో విష్ణువర్ధన్ రెడ్డి  పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.  ఏబీవీపీ నుంచి పార్టీలో ఎదిగిన ఆయన పట్ల ఏకాభిప్రాయం వచ్చిందని భావిస్తున్నారు.