Student hit a lecturer with a slipper: గురువు అంటే  ఎంతో గౌరవం. చిన్నప్పుడు మాస్టర్లను చూస్తేనే కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాం. అదే చదువుకునేటప్పుడు టీచర్లను చూస్తేనే భయంతో కూడిన గౌరవం వస్తుంది. వారి గురించి ఒక్క చిన్న మాట కూడా తప్పుగా మాట్లాడేందుకు సంస్కారం అడ్డు వచ్చేది. కానీ ఇదంతా అప్పటి రోజుల్లో. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌‌ల ప్రభావమో లేకపోతే సెల్ ఫోన్ పిచ్చి పరాకాష్టకు చేరుకుందేమో కానీ టీచర్లను.. లెక్చరర్లను గౌరవించే వారు తగ్గిపోయారు. చివరికి వారిపై అసభ్యంగా మాట్లాడుతూ.. చెప్పులతో దాడి చేసే పరిస్థితి వచ్చింది. దానికి విజయనగరంలో జరిగిన ఈ ఘటనే కారణం. 

విజయనగరంలోని రఘు ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ హెచ్‌వోడీ అయిన లెక్చరర్‌తో ఓ విద్యార్థిని గొడవ పడుతున్న దృశ్యాలను అక్కడి విద్యార్థులు వీడియో తీశారు. లెక్చరర్‌తో ఆవేశంగా మాట్లాడుతున్న ఆ విద్యార్థిని కాసేపటికి విచక్షణ మరిచిపోయి చేతిలోకి చెప్పు తీసుకుంది.  వెంటనే ఆ చెప్పుతో లెక్చరర్‌పై దాడి చేసింది. దాంతో విద్యార్థులంతా షాక్ కు గురయ్యారు.  

ఈ వీడియో వైరల్ కావడంతో అసలేం జరిగిందని విద్యార్థి లోకం అంతా ఆరా తీస్తోంది. కాలేజీలో విద్యార్థులు ఫోన్లు వాడుతున్నారన్న కారణంగా..ఎవరూ ఫోన్లు తీసుకు రావొద్దని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే కొంత మంది సైలెంట్ మోడ్‌లో ఉంచి..క్లాసులు జరుగుతున్న సమయంలో చాటింగ్ చేస్తున్నారు. ఇలా దాడి చేసిన విద్యార్థిని కూడా అదే చేస్తోంది. ఆ సమయంలో లెక్చరర్ పట్టుకున్నారు. ఫోన్ తీసుకున్నారు. ఈ వివాదంపై క్లాసు బయటకు వచ్చిన తరవాత లెక్చర్ తో ఆ విద్యార్థిని గొడవ పెట్టుకున్నారు. 

ఓ విద్యార్థిని తనను నానా మాటలు అనడంతో ఆ లెక్చరర్ కూడా గట్టిగా మాట్లాడారు. దాంతో విద్యార్థిని మరింత రెచ్చిపోయారు. గురువుపై చేయకూడని దాడి చేశారు.  

ఈ విద్యార్థిని వ్యవహారంపై అనేక రకాల గాసిప్స్ ప్రచారం అవుతున్నాయి. అయితే ఫోన్ పిచ్చి కారణంగా యువత ఎలా నాశనం అయిపోతుందో అన్నదానికి ఈ ఘటనే ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.   ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇలాంటి ఘటనలు ఇంకా ఎక్కువగా జరుగుతున్నాయన్న అభిప్రాయాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.