APBJP : ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధికార పార్టీ అవినీతి అక్రమాలపై పోరాటానికి సిద్ధమయింది. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందు కోసం పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాడు పదకొండు మందితో కమిటీని నియమించారు. పురందేశ్వరి, సత్యకుమార్ మార్గదర్శక్‌లుగా ఉంటారు. పీవీఎన్ మాధవ్ కన్వీనర్ గా ఉంటారు. సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు, వాకాటి నారాయణరెడ్డి, కొత్తపల్లి గీత, ఐవైఆర్ కృష్ణారావు, పార్థాసారధి, జయరాములు, శ్రీనివాస్ బాబు సభ్యులుగా ఉంటారు. వీరంతా వివిధ ప్రాంతాల వారీగా అంశాలను ఖరారు చేసి... ప్రతి పోలీస్ స్టేషన్‌లో చార్జిషీట్‌లతో ఫిర్యాదు చేస్తారు.
వైసీపీపై పోరాటం చేస్తామని ప్రకటించిన బీజేపీ !
వైఎస్ఆర్‌సీపీ, బీజేపీ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని ఆ పార్టీ నేతలు మథన పడుతున్నారు. అందుకే అధికార పార్టీపై పోరాటాన్ని ఉద్ధృతం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు జరిగాయి. వైజాగ్‌లో భూ ఆక్రమణలు, రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు... వంటి విషయాలపై బీజేపీ కమిటీ చార్జిషీట్‌లు రూపొందించనుంది.బీజేపీ కమిటీ మే 5వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు చోట్ల స్వయంగా చార్జిషీట్‌లు దాఖలు చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో విజయవాడలో ఈ కమిటీ భేటీ కానుంది.
వైసీపీపై ఇక యుద్ధమే !
గుంటూరులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన వ్యతిరేక విధానాలపై మే 5 నుంచి 15 వరకూ పది రోజులు పాటు పోరాటం చేయాలని ఏపీ బీజేపీ నిర్ణయం తీసుకుంది. మే 15 నుంచి జూన్ 15 వరకు ప్రధాని మోదీ పాలన రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ ప్రచార భేరి నిర్వహించాలని నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వంపై తాము నమోదు చేసే చార్జిషీట్లు పూర్తి స్థాయిలో ఆధారాలతో ఉండేలా చూసుకోబోతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ ఏ మాత్రం సానుభూతి చూపించడం లేదని స్పష్టమయ్యేలా పోరాట కార్యాచరణ ఉండనుంది.
కార్యవర్గ సమావేశంలోనే కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతుందని ఏపీ బీజేపీ ఇప్పటికే ఆరోపిస్తోంది. వ్యవస్థలు నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైఎస్ జగన్ అరాచకాలపై రాష్ట్ర కార్యవర్గ భేటీలో చర్చించి.. క్షేత్ర స్థాయిలో వాగ్దానాలు.. ప్రభుత్వ తప్పిదాలు, భూ కబ్జాలపై పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పిన సీఎం జగన్ ప్రజల్ని మోసం చేసిన దానిపై రాష్ట్ర జిల్లా స్థాయిలో చార్జ్ షీట్స్ బయటకు తియ్యాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భూ దందా... కబ్జాలు, ఇసుక మాఫియా సమస్యతో పాటు మద్యాన్ని నిషేధించాలని వీటిన్నిటిపై ఏపీ బీజేపీ నేతలు ఉద్యమం చేయ్యాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సమర శంఖం మోగించనున్నారు. .