ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకోవటం అంటే పక్క పార్టీలను కలుపుకోవటమా.. ఈ మాటలు ఇప్పుడు కాషాయ దళాన్ని ఇరకాటంలోకి నెడుతున్నాయి. పార్టీని బలోపేతం చేయటం అటుంచితే, మిగిలిన పార్టీలతో దోస్తి ఎంత వరకు లాభిస్తుందనేది కమలదళాన్ని గందరగోళానికి గురి చేస్తోంది..


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పుతామని పదే పదే భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి ప్రకటనలు వస్తుంటాయి. అవి విన్న కిందిస్థాయి శ్రేణులు ఏదో జరిగిపోతుందని ఆశలు పెట్టుకోవడం సర్వసాధారణం. ఆ తరువాత వాటిని గురించి పట్టించుకునే నాథుడు లేకపోవటంతో ఎప్పుడూ జరిగేదే. ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ మళ్లీ వ్యూహాలు చిస్తోంది అధినాయకత్వం. 


అయితే సొంత పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకుండా పక్క పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వటంపై గందరగోళం ఏర్పడుతోంది. ఈ వ్యవహరంపై పార్టీ నాయకత్వానికి అనేక సార్లు వివరించినా ప్రయోజనం ఉండటం లేదని రాష్ట్ర నాయకులు అంటున్నారు. కేంద్ర నాయకత్వం విధానంలోనే ముందుకు వెళ్ళటం వల్ల సొంతంగా పార్టీని ఎప్పటికి బలోపేతం చేయగలమనే ప్రశ్న గట్టిగానే వినిపిస్తోది. 


అటు జనసేన..వైసీపీ...ఇప్పుడు టీడీపీ కూడా
ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఆ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఏదోలా లాక్కొస్తున్నారు. పార్టీకి ఉన్న కొద్దిపాటి క్యాడర్ కూడా కేంద్రంపై ఉన్న ఆశలతోనే వెంట నడుస్తోంది. చెప్పుకోదగిన నేతలంతా కేంద్ర నాయకత్వంలోని పెద్దలతో టచ్‌లో ఉంటూ తమ స్థాయికి తగ్గట్టుగా రాజకీయం నడుపుతున్నారు. 


అయితే సొంతంగా పార్టీ నిర్మాణం పరిస్థితి ఎంటన్నది ప్రశ్నార్దకంగా మారింది. 2019ఎన్నికల తరువాత జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తులోకి వచ్చింది. అయితే అదే సమయంలో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతో కూడా బీజేపీ తెర వెనుక రాజకీయం మొదలు పెట్టింది. ఇటు జనసేనతో రాజకీయంగా టచ్‌లో ఉంటూ, అటు అధికార హోదాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడ దగ్గరకు చేర్చుకుంది. 


పదే పదే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలవటంతో రాజకీయం కూడా ఆసక్తిగా మారింది. తెలుగు దేశం పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది. తాజాగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమిత్ షా, నడ్డా వంటి నేతలను కలవటం చర్చనీయాశంగా మారింది. 


బీజేపీని సొంతంగా బలోపేతం చేయటానికి పని చేయాల్సిన నాయకత్వం రాష్ట్రంలో అన్ని పార్టీలను దగ్గరకు తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఇలా ఉంటే రాష్ట్రంలో సొంతంగా ఎదిగేది ఎప్పుడనే ప్రశ్న ఏపీ బీజేపీ నేతల్లో మొదలవుతోంది. 


పార్టీలో చేరికలు ఉంటేనే కిక్...
భారతీయ జనతా పార్టీ నాయకత్వం రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి వ్యూహత్మకంగా వ్యవహరించాలని రాష్ట్ర లీడర్లు అంటున్నారు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. కన్నా వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటంతో ఆ ప్రభావం చాలా మంది నాయకులపై పడింది. పార్టీ కమిటిల నియామకంలో సొము వీర్రాజును వ్యతిరేస్తూ ఓ వర్గం ఢిల్లీ వరకు వెళ్ళి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించింది. ఈ టైంలో పార్టీలో ఊపు రావాలంటే చేరికలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందంటున్నారు రాష్ట్ర నాయకులు. ఇలా కీలక నేతలను తీసుకోవటం ద్వార ఎన్నికల నాటికి గట్టి పోటీ ఇవ్వగలమనే అభిప్రాయం స్థానిక నాయకత్వంలో వ్యక్తం అవుతోంది.