BJP Vishnu :  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీకి  ఓటేస్తే దుర్వినియోగం అవుతాయని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీకే మరోసారి ప్రజలు మద్దతుగా నిలిచారని... ఏపీ ప్రజలు కూడా బీజేపీకి చాన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపై మండిపడ్డారు. దేశంలో ఎక్కడ అయినా ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగుతాయని..కానీ ఏపీలో మాత్రం ప్రజాస్వామ్య  విరుద్ధంగా జరుగుతున్నాయని  విమర్శించారు.  టీడీపీ తమ నాయకులను పోటీలో పెట్టడానికి వెనుకాడుతోందని..  ఆ పార్టీ వైసీపీని ఎదుర్కొనే స్థితిలో లేదన్నారు. వైసీపీకి ఎదురు నిలిచే పార్టీ బీజేపీ ఒక్కటేనని స్పష్టం చేశారు. 


వైసీపీ  టిక్కెట్ల కోసం తొత్తులుగా పని చేస్తున్న కొంత మంది పోలీసులు


పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు పాల్పడుతోందని..  వైసీపీ నాయకుల అభివృధి పై మాట్లాడం లేదని విమర్శించారు.  అధికారులు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తే మాకు ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారని..  కదిరి సీఐ మీసాలు మెలెసి, తొడ కొట్టిన అంశాన్ని  ఎన్నికల కమిషన్ ఎందుకు ఈ ఘటన సుమోటో గా తీసుకోరని ప్రశ్నించారు. ప్రజలు కట్టే పన్నులను జీతాలుగా తీసుకొని వైసీపీకి తొత్తులుగా పని చేస్తున్నారని మండిపడ్డారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు వేశారని..కానీ అవి కేంద్రం ఇచ్చిన నిధులన్నారు. వైసీపీ మానిఫెస్టో లో 12,500 రైతులకు ఇస్తామని చెప్పారు...ఈ నాలుగు సం.కాలంలో ఎంత వేశారో శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 


రైతు భరోసా నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి


కేంద్రం ఇస్తున్న డబ్బులు కలిపి ఇస్తున్నందున..   ముఖ్యమంత్రి జగన్  అందరికీ క్షమాపణ చెప్పి  రూ.  24 వేలు ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.  .రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. టీడీపి 175 స్థానాలలో పోటీ చేస్తామని చెప్పడం లేదని.. కానీ బీజేపీ,జనసేన కలిసి 175 స్థానాలలో పోటీ చేస్తాయని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.  రానున్న రోజుల్లో సంచలనాత్మక నిర్ణయాలు బీజేపీ తీసుకోబోతోందన్నారు.  రాష్ట్రంలో బీజేపీ లక్ష కోట్లతో రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయని గుర్తు చేశారు.  కేంద్రం అభివృధి చేస్తుంటే కొంత మంది ఏడుస్తూ ఉంటారని..  ప్రజలు మాకు ఓట్లు వేయకున్న మేము రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. 


జర్నలిస్టులపై అట్రాసిటీ కేసులు దారుణం


రాయలసీమకు చెందిన  చంద్రబాబు,వైఎస్ జగన్ రాయలసీమను మోసం చేశారని ఆరోపించారు.  బీజేపీ అధికారంలోకి వస్తే రాయలసీమ డిక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని  హామీ ఇచ్చారు. ఇటీవల కదిరిలో జరిగిన ఘటనల విషయంలో  జర్నలిస్ట్ లాపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయడంపై విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా కేసులు నమోదు చేశారని..  సీఐ పై ఇప్పటివరకు ఎందుకు విచారణ చేయలేదని విష్ణువర్దన్ రెడ్డి ప్రశ్నించారు.  ఏపీ హోమ్ మంత్రి ఈ ఘటన పై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ వస్తుందని.. 2024లో కూడా మోడీ మరోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు.  రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయమని అడుగుతున్నామన్నారు.