BJP Vishnu On Chruch Funds :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్చిల నిర్మాణం, మరమ్మతుల కోసం నియోజకవర్గానికి రూ. కోటి విడుదల చేయడం రాజకీయ దుమారానికి కారణం అవుతోంది.  ప్రజల కట్టిన పన్నులడబ్బుతో ఓటు బ్యాంకు రాజకీయాలు, మత రాజకీయాలా సిగ్గుచేటని ఏపీ బీజేపీ మండి పడింది.  ప్రజల అభివృద్ధిని వారి సంక్షేమాన్ని గాలికి వదిలేసి అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా డబ్బుల పంపిణీతో పాలన సాగిస్తున్నారని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.  ఇమామ్ లకు, మౌజంలకు, పాస్టర్లకు నెల నెలా క్రమం తప్పకుండా జీతాలు ఇస్తూ, వారి జీతాలను పెంచుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న మాట వాస్తవమన్నారు. 


ప్రజాధనాన్ని మతపరమైన సంస్థల నిర్మాణాలకు ఇవ్వడం ఏమిటన్న విష్ణువర్ధన్ రెడ్డి 


ఇలా నెలవారీగా ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను మత వ్యవహారాలకు వినియోగిస్తూ.. ఇప్పుడు కొత్తగా చర్చిల నిర్మాణాలకు, వాటి రిపేర్లకు నియోజకవర్గానికి కోటి చొప్పున కేటాయించడం అంటే  వైసీపీ ప్రభుత్వం ఈ ఓటు బ్యాంకు రాజకీయాలను పతాకస్థాయికి చేర్చడమేనన్నారు.  ఒకవైపు బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వాటిని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజలు కట్టిన పన్నులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు.  రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని  ప్రకటించారు. 


నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం చేయడంతో పాటు కోర్టును ఆశ్రయిస్తామన్న విష్ణువర్ధన్ 


చర్చిల నిర్మాణానికి నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున మంజూరు చేస్తూ ఏపీ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. రూ. 175 కోట్లతో చర్చిల నిర్మాణం, చర్చిల మరమ్మతులు, ఇతర పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు.  . జిల్లా కేంద్రాలకు మరో కోటి చొప్పున అదనంగా మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.  ఈ నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో ప్రభుత్వం అందించనుంది. మొత్తంగా  నియోజకవర్గాలు.. జిల్లా కేంద్రాలకు కలిపి రెండు వందల కోట్లపైనై ఇవ్వనున్నట్లుగా  చెబుతున్నారు. 


ప్రైవేటు చర్చిలకు  ప్రజాధనం ఇవ్వడం చట్ట విరుద్ధమంటున్న బీజేపీ 


ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బులను మత పరమైన కట్టడాలకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని బీజేపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.   గతంలో బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎంపీ ల్యాడ్స్ నిధులను చర్చిల నిర్మాణం కోసం ఇవ్వడం జాతీయ స్థాయిలో వివాదాస్పదమయింది. ఈ అంశంపై కేంద్రం కూడా విచారణ జరుపుతోంది. అయినప్పటికీ ఇప్పుడు నేరుగా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.  చర్చిలు ప్రభుత్వానివి ఉండవు. అన్నీ ప్రైవేటువే లేకపోతే.. క్రిస్టియన్ సంస్థల ఆధ్వర్యంలో ఉంటాయి.అలాంటి ప్రైవేటు చర్చిలకు ప్రభుత్వం కోట్లు ఇవ్వడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధమని బీజేపీ నేతలు చెబుతున్నారు.