బద్వేలు ఉపఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. బద్వేల్ ఉపఎన్నికలో భారీగా రిగ్గింగ్‌ జరిగిందన్నారు. పోలీసులు కూడా వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునల్‌ దేవ్‌ధర్‌తో కలిసి జీవీఎల్‌ మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. పక్క నియోజకవర్గాల నుంచి అద్దె ఓటర్లను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. ఎన్నికల్ని అపహాస్యం చేసేలా వైసీపీ వ్యవహరించిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు బద్వేలులో తిష్టవేసి దొంగ ఓట్లు వేయించారని ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు. శనివారం జరిగిన పోలింగ్‌లో కనీసం  50 నుంచి 60 వేల దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. బద్వేలులోని 28 పోలింగ్‌ కేంద్రాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని విమర్శించారు. ఎన్నికల అధికారులు, పరిశీలకులు కేవలం ప్రేక్షకపాత్రకు పరిమితం అయ్యారన్నారు. అక్రమాలు జరిగిన చోట్ల రీపోలింగ్‌ జరపాలని ఈసీని కోరామని జీవీఎల్‌ పేర్కొన్నారు.


Also Read: బద్వేలులో 70 శాతానికిపైగా పోలింగ్.. కలకలం రేపిన దొంగ ఓటర్లు !






బీజేపీ ఏజెంట్లకు బెదిరింపులు


బద్వేల్ ఉపఎన్నిక సీఎం జగన్, వైసీపీల అక్రమాలకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మాట, మడమ తిప్పని పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. ఆదివారం కడపలో మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు.. బద్వేల్ ఉపఎన్నికలో వైసీపీ తీరుపై విమర్శలు చేశారు. బద్వేల్‌ పోలింగ్ చూస్తే 55 శాతం కూడా ఓటింగ్ మించకూడదని, కానీ దొంగ ఓట్లు వల్ల ఓటింగ్ శాతం పెరిగిందని సోము వీర్రాజు ఆరోపించారు. ఓటమి భయంతో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. మండలాల వారీగా ఇన్‌ఛార్జ్‌లుగా ఉన్న వైసీపీ నాయకులు బీజేపీ ఏజెంట్లను బెదిరించారన్నారు. తిరుపతి ఉప ఎన్నికలా అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. 


Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ! 


బద్వేల్ లో ప్రజాస్వామ్యం ఖూనీ


బద్వేల్‌లో దొంగ ఓటర్లు బారులు తీరారని సోము వీర్రాజు విమర్శించారు. సిద్ధవటం, కడప, ప్రొద్దుటూరు నుంచి అద్దె ఓటర్లను వాహనాల్లో తరలించారన్నారని ఆరోపించారు. బద్వేలు ఉప ఎన్నికలో అడుగడుగునా దౌర్జన్యాలు జరిగాయన్నారు. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా వ్యవహరించి, ప్రజాస్వా్మ్యాన్ని ఖూనీ చేసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బద్వేలులోని 28 చోట్లలో రీపోలింగ్ జరిపించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. వైసీపీలా బీజేపీకి దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం లేదన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే వైసీపీకి బీజేపీ గురించి మాట్లాడే హక్కులేదన్నారు. బద్వేల్‌లో బై పోల్ జరగలేదని, బస్ పోల్ అని ఎద్దేవా చేశారు.


Also Read: వైసీపీ మాటలకు అర్థాలే వేరులే... వారంలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలి... విశాఖ సభలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి