AP Decentralisation : వికేంద్రీకరణపై శాసనసభలో స్పల్ప కాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ అమరావతి భూములు కొందరి చేతుల్లోనే ఉన్నాయన్నారు.  అమరావతి ఉన్నవన్నీ తాత్కాలిక నిర్మాణాలు అన్నారు. అమరావతిలోని 30 వేల ఎకరాల్లో 10 మంది చేతుల్లోనే 10 వేల ఎకరాలు ఉన్నాయని సభకు తెలిపారు. టీడీపీ అంటేనే టెంపరరీ డెవలప్‌మెంట్‌ పార్టీ అని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు భూములు కొన్నది వాస్తవం కాదా? అని మంత్రి ప్రశ్నించారు.


రాజధాని ప్రకటనకు ముందే భూముల కొనుగోలు- మంత్రి బుగ్గన 


"శివరామకృష్ణన్ కమిటీ రాజధానిపై ఇచ్చిన రిపోర్టును గత ప్రభుత్వం కనీసం అసెంబ్లీ పెట్టలేదు. టీడీపీ ప్రభుత్వం ఈ రిపోర్టును కాదని ఓ వ్యాపార కమిటీని పెట్టి వాళ్ల ద్వారా అమరావతిని ఉత్తమమైన రాజధానిగా చెబుతారా? ఎక్కువ శాతం ప్రజలు అమరావతి ఒప్పుకున్నారని చెప్పారు, కానీ ఫోన్ ద్వారా 1300 మందిని మాత్రమే అడిగారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలని ఉంది. కొంత మంది చేతుల్లో అమరావతి భూములు ఉన్నాయి. లంక భూములు, పోరంబోకు భూములు తీసుకున్నారు. రాజధాని రాబోతుందని తెలిసి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకోక ముందే టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భూములు కొన్నారు. చంద్రబాబు 14 ఎకరాల భూమి కొన్నారు. లోకేశ్ సమీప బంధువు, లింగమనేని రమేష్, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, పుట్టా మహేశ్ యాదవ్, పరిటాల సునీత వీళ్లంతా అమరావతిలో భూములు కొన్నారు. ఎస్సీ, ఎస్టీల వద్ద భూములు తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే ఇక్కడ రాజధాని రాబోతుందని తెలుసు, అందుకే దీనిని ఇన్ సైడర్ ట్రేడింగ్ అని సీఎం జగన్ అంటున్నారు. మొదటి ఫేజ్ కు రూ. లక్ష కోట్లు కావాలంటా? రాజధానికి రూ. 10 లక్షల కోట్ల కావాలా? రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల బడ్జెట్ రాజధాని కోసం పెట్టాలా? టీడీపీ నేతలు వ్యాపారం చేసేందుకే ఇక్కడ రాజధాని అమరావతిని కోరుతున్నారు."- మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 


దమ్ముంటే నా భూమి లాక్కోండి-పయ్యావుల 


టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... "రాజధాని భూములు టీడీపీ వాళ్లు రాజధాని ప్రకటన ముందే ఎలా కొన్నారని మంత్రి బుగ్గన అన్నారు. 2014లో మంత్రి బుగ్గన ప్రమాణం చేసినప్పటి నుంచి ఈ మాటే మాట్లాడుతున్నారు. రాజధాని ప్రకటన వచ్చిన తర్వాతే నేను భూమి కొన్నాను. నా ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా మెన్షన్ చేశాను. ముఖ్యమంత్రి అసెంబ్లీ ప్రకటన చేసిన తర్వాత భూమి కొంటే తప్పేముంది. వైసీపీ ప్రభుత్వం రాజధానిపై ఎన్ని కేసులు పెట్టాలో అన్నీ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం బినామీ చట్టాన్ని తెచ్చింది. నేను అనైతికంగా అమరావతిలో భూమి కొంటే బినామీ చట్టం ప్రయోగించి నా భూమి లాక్కోండి. పయ్యావుల కేశవ్ భూమి కొన్నారని సుప్రీంకోర్టులో కేసులు వేశారు. సుప్రీంకోర్టులో ఆ కేసు ఓడిపోయారు. హైకోర్టులో వైసీపీ నేతలు కేసులు వేశారు. అక్కడా చివాట్లు తిన్నారు. " - పయ్యావుల కేశవ్, టీడీపీ ఎమ్మెల్యే 


130 కోట్ల ఇండియాకు దిల్లీ నుంచే పాలన- నిమ్మల 


" 2014లో విభజన అనంతరం 13 జిల్లాలకు పాలనా సౌలభ్యంతో అమరావతిని రాజధాని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి ప్రతిపక్షనేత , ప్రస్తుత సీఎం జగన్ ఆ రోజు అమరావతిని స్వాగతిస్తానని చెప్పారు. అప్పట్లో జగన్ రాజధాని 30 వేల ఎకరాల పైబడి ఉండాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మించారు. రాజధానికి రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఇప్పుడు పాలనా సాగుతుందంటే అది అప్పటి ప్రభుత్వం నిర్ణణమే. అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ ఇక్కడే ఇళ్ల కట్టుకున్నారు. భవిష్యత్ అమరావతిని ఒక్క అంగుళం కూడా జరపనివ్వరు. ఇక్కడే రాజధాని ఉంటుందన్నారు. జగన్ మాట తప్పారని మేము మాటతప్పం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప పాలనావికేంద్రీకరణ కాదు. 130 కోట్ల జనాభా ఉన్న ఇండియాకు దిల్లీ నుంచే పాలన జరుగుతోంది. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కు లక్నో నుంచి పాలన చేస్తున్నారు. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీకి ఇలా మూడు రాజధానులు చేయడం సరికాదు. ఈ నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకిస్తుంది. "- టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు