CM Jagan : టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్... దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని సీఎం జగన్ అన్నారు. అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ పై సోమవారం చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. విద్యార్థుల పేరుతో టీడీపీ నేతలు అతి పెద్ద కుంభకోణం చేశారని ఆరోపించారు. స్కిల్‌ డెవలప్మెంట్ పేరిట టీడీపీ ప్రభుత్వం అడ్డంగా దోచుకుందన్నారు. ఈ స్కామ్ రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌ అన్నారు. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్‌ ఈ స్కామ్ అన్నారు. 


రూ.371 కోట్ల స్కామ్ 


స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారని సీఎం జగన్ విమర్శించారు. ఈ డబ్బును షెల్‌ కంపెనీ ద్వారా మళ్లించారని ఆరోపించారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్ చేశారన్నారు. ప్రొఫెషనల్ స్కిల్డ్‌ క్రిమినల్‌ చేసిన స్కామ్‌ ఇది అని సీఎం జగన్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ స్కాం ఏపీ నుంచి విదేశాలకు వరకూ పాకిందన్నారు.  విదేశాల నుంచి షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి డబ్బు రాష్ట్రానికి వచ్చిందన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం రూ. 371కోట్లు కొట్టేశారని సభలో సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్ ప్లాన్ చేసి స్కామ్‌ చేశారన్నారు. ఈ స్కామ్ లో దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. విచారణ చేస్తే ఏం చేయాలో కూడా ముందుగానే ప్లాన్ చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ భారీ కుంభకోణం ఊపిరిపోసుకుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పై చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదని ఆరోపించారు సీఎం జగన్. 


స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్


"స్కిల్ పేరిట గత ప్రభుత్వంలో ఏ విధంగా దోచేశారన్నది సభ ద్వారా ప్రజలకు తెలియాలి. యువతకు స్కిల్స్ పెంచి వాళ్లను ఉద్యోగాలకు సిద్ధం చేసేలా ఉండాలి. కానీ ఈ స్కిల్స్ డెవలప్మెంట్ ద్వారా స్కామ్ చేయడం చంద్రబాబుకు ఉన్న గొప్ప స్కిల్. ఏ రకంగా యువతకు నష్టం జరిగిందో ప్రజలకు తెలియాలి. రూ.100 పనిచేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్ గా తీసుకుని ఆ పది రూపాయలు దోచుకున్న వ్యవహారమే ఈ స్కామ్. అమెరికాలో మీకు లాటరీ తగిలింది అని చెప్పి పది లక్షలు కట్టించుకుని దోచేస్తుంటారు. అదే విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరిగింది. సిమెన్స్ పేరు చెప్పి జరిగిన పెద్ద స్కామ్ ఇది. ఈ వ్యవహారం మొత్తం చంద్రబాబు కనుసన్నల్లో జరిగింది. రూ.371 కోట్ల డబ్బు హారతి కర్పూరంలా మాయమైపోయింది. షెల్ కంపెనీ ద్వారా వివిధ మార్గాల్లో చంద్రబాబుకు ఈ డబ్బు చేరింది. ఒక స్కిల్డ్ క్రిమినల్ చేసి స్కామ్. కేబినెట్ ఒకటి చెప్పి, దానిపై జీవో ఇష్యూ చేసి.. ఆ తర్వాత వీటికి విరుద్ధంగా ఓ ఒప్పందం చేసుకున్నారు." - సీఎం జగన్