Jagananna Colonies : రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణంపై శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌(CM Jagan) మాట్లాడారు. ఇళ్ల స్థలాల పంపిణీ, పేదలకు ఇళ్ల నిర్మాణాలపై సుదీర్ఘమైన చర్చ జరిగిందన్నారు. మంత్రి రంగనాథరాజు కూడా ఈ పథకంపై వివరణ ఇచ్చారన్నారు. ప్రతి ఎమ్మెల్యే(MLA) తన నియోజకవర్గంలో ఫలానా పని నేను చేశాను అని సగర్వంగా చెప్పుకునే గొప్ప కార్యక్రమం ఈ రోజు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యేలు ఏదైనా నియోజకవర్గంలో తిరగడం మొదలుపెడితే నాకు పెన్షన్‌ రాలేదనో, ఇల్లు లేదనో, ఫలానా స్కీం అందలేదనో, అర్హత ఉండి కూడా రాలేదనే పరిస్థితులు ఇవాళ లేదన్నారు. ప్రతి శాసనసభ్యుడు సగర్వంగా కాలర్‌ ఎగరేసుకునే పరిస్థితుల్లోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి పథకాన్ని పారదర్శకంగా, లంచాలకు, వివక్షకు తావు లేకుండా అమలుచేస్తున్నామన్నారు. పథకంలో అర్హత ఉంటే చాలు ఏ పార్టీ అని చూడడంలేదన్నారు. 


30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ 


రాష్ట్రంలో ఇప్పటి వరకూ దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల(Land Deeds) పంపిణీ చేశామని సీఎం జగన్ అన్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఇది పూర్తయితే 30.76 లక్షల అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి అందించే గొప్ప కార్యక్రమం అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కాకుండా అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరిగేలా ఈ కార్యక్రమం అమలుచేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి 71,811 ఎకరాల భూమిని సేకరించామన్నారు. ఈ భూమి విలువ కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుందన్నారు. 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించి 2.62 లక్షల ఇళ్లు కూడా ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 17,005 కాలనీలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే, కొత్తగా 17 వేల కాలనీలు ఏర్పాటవుతున్నాయన్నారు. కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్‌ గ్రామ పంచాయితీ సైజులో కనిపిస్తున్నాయని సీఎం అన్నారు. అందుకే ఇవాళ ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని సభలో సీఎం జగన్ అన్నారు. 


ప్రధాని మోదీకి కృతజ్ఞతలు 


 "రాష్ట్రంలో 17,005 వైయస్సార్‌ జగనన్న కాలనీల్లో తొలిదశలో 10,067 కాలనీల్లో  ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్లు కడుతున్నాం. మొత్తం రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మోదీ(PM Modi)కి కూడా మనం కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీలలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్‌ ఇటువంటి మౌలిక సదుపాయాలతో పాటు స్కూల్స్, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. దీనికి కొద్ది సమయం పడుతుంది." అని సీఎం జగన్ అన్నారు. 


తక్కువ ధరకే సిమెంట్, ఐరన్


గతంలో చంద్రబాబు హయాంలోఇంటి విస్తీర్ణం రూరల్‌లో ఇంచుమించు 215 చదరపు అడుగులు ఇచ్చారని,  ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు ఉందన్నారు. ప్రతి ఇంట్లో బెడ్రూం, లివింగ్‌ రూం, కిచెన్, బాత్రూమ్‌ కమ్‌ టాయ్‌లెట్, వరండా ఉంటాయన్నారు. అందులో భాగంగానే సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా డోర్లు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్‌ సామాగ్రి వంటి 14 రకాల నాణ్యమైన సామాగ్రిని తీసుకువచ్చామన్నారు. ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్‌ పడుతుందన్న సీఎం... మామాలుగా మార్కెట్‌లో సిమెంట్‌ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉందన్నారు. పేదలకు సంబంధించిన ఇళ్లకు మాత్రం సిమెంట్‌ కంపెనీలతో మాట్లాడి వారిని ఒప్పించి పీపీసీ సిమెంట్‌ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేటట్టు మాట్లాడామన్నారు. ప్రతి లబ్దిదారుడికి 20 టన్నుల ఇసుక అవసరమైతే అది కూడా ఉచితంగా డోర్‌ డెలివరీ చేస్తున్నామన్నారు. దాదాపుగా 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను మార్కెట్‌ రేటు కన్నా తక్కువకే ఇస్తున్నామన్నారు.