" క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ " అని పోలీసులకే మెసెజ్ పెట్టాడంటే ఆ దొంగకు ఉన్న కాన్ఫిడెన్స్‌ను అర్థం చేసుకోవచ్చు. అలాంటి దొంగను పట్టుకోవాలంటే ఆషామాషీ కాదు. హైదరాబాద్ పోలీసులకు ఇలాంటి సవాల్ చేసిన దొంగ.. చివరికి బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డాడు. అసలు ఆ దొంగ ఎవరు ? హైదరాబాద్ పోలీసులకు ఎందుకు సవాల్ చేశాడు? బెంగళూరు పోలీసులకు ఎలా దొరికాడు ? ఇవన్నీ తెలుసుకోవాలంటే.. ఓ పెద్ద క్రాక్ స్టోరీ అవుతుంది. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
రూ.కోటికి తగ్గని కార్లను చోరీ చేసే షెకావత్ !
దొంగలది ఒక్కో స్టైల్. రాజస్తాన్‌కు చెందిన సత్యేంద్ర సింగ్ షెకావత్‌ది మాత్రం ఎవరూ ఊహించని స్టైల్. ఆయన ఆషామాషీ దొంగతనాలు చేయరు. రూ. కోటికి తగ్గనికార్లను మాత్రమే చోరీ చేస్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ , బెంగళూరు వంటి ప్రాంతాల్లో కార్లను చోరీ చేశారు. 2020 జనవరిలో హైదరాబాద్ పార్క్ హయత్‌లో కన్నడ నిర్మాత వి.మంజునాథకు చెందిన ఖరీదైన కారు చోరీకి గురైంది. సీసీ కెమెరాలు ఇతర సాక్ష్యాలతో దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూండగానే హైదరాబాద్‌లోనే మరో రెండు ఖరీదైన కార్లను దొంగిలించాడు. తర్వాత అదృశ్యమయ్యాడు.
ఎలా దొంగతనాలు చేస్తాడంటే ?
సత్యేంద్ర సింగ్ షెకావత్ చూడటానికి పెద్ద కార్పొరేట్ పర్సన్‌లా ఉంటారు. ఆయన కకార్ల చోరీ చేయడానికి ప్రత్యేకంగా రెండు డివైజ్‌లను రూ. పది లక్షలకుపైగా వెచ్చించి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఓ డివైస్‌తో తాళాలను డీకోడ్ చేసుకుంటాడు.. మరో డివైస్ డూప్లికేట్ డిజిటల్ కీస్ రెడీ చేసుకుంటాడు. వాటి ద్వారా కారు తలుపు తెరిచిన తర్వాత స్టీరింగ్ కింద ఉండే ఎలక్ట్రానిక్ బోర్డు ఓపెన్ చేసి.. లాస్ట్ కీ ఆప్షన్ ద్వారా కారును స్టార్ట్ చేస్తాడు. అతని దగ్గరున్న డివైస్‌లతో దొంగతనం చాలా సులువుగా సాగిపోతుంది.
రాజస్తాన్ వెళ్లిన హైదరాబాద్ పోలీసులు క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ అంటూ సవాల్ చేసిన షెకావత్ !
కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకా వత్‌గా గుర్తించిన హైదరాబాద్ పోలీసులు రాజస్థాన్‌కు వెళ్లారు. పోలీసులు వారం రోజుల పాటు అక్కడ తిష్టవేసి షెకావత్ తండ్రిని ప్రశ్నించారు. అతని భార్యనిత అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు షెకావత్ గుర్తించి నేరుగా బంజారాహిల్స్ పోలీసులకు ఫోన్ చేసి ‘నన్ను పట్టుకోవడం మీ తరం కాదంటూ మరోసారి సవాల్ విసిరాడు. మీరు వాడుతున్న టెక్నాలజీ చాలా పాతదని అప్‌డేట్ అవ్వాలని ఆ తర్వాతే తనను పట్టుకోవాలని సలహా కూడా ఇచ్చారు. దొంగతనం చేసిన కార్లను అమ్ముతున్న కారణంగా షెకావత్ భార్యను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నంచారు. ఆమెకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. అప్పట్నుంచి షెకావత్‌ను హైదరాబాద్ పోలీసులు పట్టుకోలేకపోయారు.
పట్టుకున్న బెంగళూరు పోలీసులు !
గత నాలుగేళ్లలో బెంగళూరు నుంచి ఇలా పధ్నాలుగు హై ఎండ్ కార్లను షెకావత్ చోరీ చేశారు. దీంతో బెంగళూరు పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. రాజస్ధాన్‌లోని జోథ్ పూర్ పోలీసులతో ప్రత్యేకంగా నిఘా పెట్టి షెకావత్‌ను పట్టుకుని బెంగళూరు తరలించారు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి.. చేసిన సవాల్‌కు బదులు చెబుతారేమోచూడాలి !