CM Jagan : ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వికేంద్రీకరణపై స్వల్ప చర్చ జరుగుతోంది. ఈ చర్చలో సీఎం జగన్ మాట్లాడారు. అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి 1000 రోజులుగా ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. కట్టని రాజధాని గురించి కట్టలేని గ్రాఫిక్స్ గురించి కృత్రిమ ఉద్యమం నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు చేస్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సొంత అభివృద్ధి కోసమే అమరావతి ఉద్యమం అన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కన్నా కట్టని, కట్టలేని అమరావతి చంద్రబాబుకు గొప్పదన్నారు. దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ పథకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారన్నారు. రాజధానిలో తన అనుచరులతో చంద్రబాబు భూములు కొనుగోలు చేశారని సీఎం జగన్ ఆరోపించారు.
రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశాం- సీఎం జగన్
ప్రజా సంక్షేమానికి రూ.లక్షా 65 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ అసెంబ్లీలో తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకాలు, పేదలకు పక్కా ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దోచుకో, దాచుకో, పంచుకో ఇదే టీడీపీ సిద్ధాంతమని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి రూ.4-5 లక్షల కోట్లు అవుతాయని చంద్రబాబు అన్నారని, ఎకరాకు రూ.2 కోట్ల చొప్పున రూ.లక్షా 10 వేల కోట్లు అవసరం అవుతాయని చంద్రబాబే చెప్పారన్నారు. ప్రతిపక్షంలోనూ తన మనుషులే ఉండాలని చంద్రబాబు కోరుకుంటారని సీఎం జగన్ విమర్శించారు.
అమరావతిపై నాకు కోపం లేదు
"ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం ఒక్క రోజు కూడా ఉద్యమం చేయని చంద్రబాబు, ఇతర పెత్తందారులు ఇప్పుడు కట్టని రాజధాని కోసం వెయ్యి రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రాజధాని కోసం ఇతర ప్రాంతాల వారిని రెచ్చగొడుతూ ఒక ఉద్యమం నడుపుతున్నారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమం చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమా? ఈ ఉద్యమం. పెత్తందారులు సొంత అభివృద్ధి కోసం అమరావతి ఉద్యమం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే కోర్టుల్లో కేసులు వేయిస్తారు. ఎందుకంటే కేవలం చంద్రబాబుకు చెందిన పెత్తందారుల ప్రైవేట్ స్కూళ్లల్లోనే ఇంగ్లీష్ మీడియం ఉండాలని కోర్టులకెక్కారు. అమరావతి ప్రాంతంపై నాకు ఎందుకు కోపం? ప్రతి ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశమే ఉంటుంది. కానీ ఒక ప్రాంతంపై ఎక్కువ ప్రేమ ఉండదు. అమరావతి ప్రాంతం ఇటు విజయవాడ అటు గుంటూరుకు దూరంగా ఉంటుంది. ఇటువంటి ప్రాంతంలో కేవలం కనీసం రోడ్లు, కరెంట్, నీరు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వమే రూ. 1.10 లక్షల కోట్లు అవుతుందని చెప్పారు. కేవలం మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు అవుతుంది. బిల్డింగులు లేకుండానే ఇంత ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవుతుందని చెప్పిన చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో కేవలం రూ.5674 కోట్లు మాత్రమే రాజధానికి కేటాయించారు. ఇందులో రూ.2297 కోట్లు కట్టకుండా బకాయిలుగా పెట్టారు. తన బినామీల కోసం ఇక్కడ రాజధాని పెట్టారు." - సీఎం జగన్
ఉత్తరాంధ్ర ప్రజలకు భావోద్వేగాలు ఉండవా?
"చంద్రబాబు హయాంలో, ఇప్పుడు ఒకే బడ్జెట్ ఉంది. టీడీపీ హయాంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకివ్వలేదు. అప్పుడు దోచుకో పంచుకో తినుకో అనే విధంగా పాలన సాగించారు. బినామీ భూములు ప్రాంతమే రాజధానిగా ఉండాలని అమరావతిలో రాజధాని పెట్టారు. రాష్ట్ర రాజధానిపై రకరకాల డ్రామాలు ఆడుతున్నారు. తాత్కాలిక రాజధానిలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కొందరు పెత్తందారుల కోసమే అమరావతి ఉద్యమం చేస్తున్నారు. ఉద్యమాల పేరుతో పెట్రోల్, డీజిల్ పోసి ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు భావోద్వేగాలు ఉండవా?. ఉత్తరాంధ్రప్రజలు మాత్రం కామ్ గా ఉండాలంట. దుష్టచతుష్టీయం రాష్ట్రాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు. "- సీఎం జగన్
Also Read : TDP MLAs Suspension: అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ - ఎప్పటివరకంటే ?