AP Assembly Budget Session 2024-25| అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులు జరిగాయి. ప్రొటెం స్పీకర్ ఎన్నికతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులతో ఆయన ప్రమాణం చేయించారు. రెండో రోజు స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా అసెంబ్లీ సమావేశాలు సభ్యుల ప్రమాణం, స్పీకర్ ఎన్నికతో ముగిశాయి. అయితే ఏపీ అసెంబ్లీ వచ్చే నెల మరోసారి సమావేశం కానుంది. 


జులైతో ముగియనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 
జులై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రభుత్వం త్వరలోనే తేదీలను వెల్లడించనుంది. గత ప్రభుత్వం ఎన్నికల కారణంగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులైతో పూర్తవుతుంది. ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పూర్తి స్థాయి బడ్జెట్ ను చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు, కార్పొరేషన్ లోన్లు, ఇతరత్రా ఆదాయం, అప్పుల చిట్టా వివరాలు ఓ కొలిక్కి వచ్చాక.. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆ బడ్జెట్ ఆమోదం కోసం జులై మూడో వారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు.


కూటమి మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన 
సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీలు ప్రతిబింబించేలా చంద్రబాబు ప్రభుత్వం ఆగస్టు నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరివరకు బడ్జెట్ రూపొందిస్తోంది. జూన్ 24న జరిగిన ఏపీ కేబినెట్ లో ఆమోదం పొందిన నిర్ణయాలను బిల్లుల రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఏపీ మంత్రులు ఒక్కొక్కరుగా దాదాపు అంతా తమ శాఖల బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లు వైసీపీ చేసిన పనులు, అప్పులు, జరుగుతున్న పనుల ప్రస్తుత పరిస్థితి, వారి ఖర్చులపై అన్ని శాఖల మంత్రులు నివేదికలు తయారుచేయాలని అధికారులను ఆదేశిస్తున్నారు.