Nara Lokesh On Arogyashri: ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ (Arogyashri) బకాయిలపై పొలిటికల్‌ ఫైట్‌ మొదలైంది. బకాయిలు చెల్లించకపోతే ఈనెల 27 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని నెట్‌వర్క్ ఆస్పత్రులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి లేఖ రాశాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్‌(Nara Lokesh) రియాక్ట్‌ అయ్యారు. పేదల ఆరోగ్యం, ప్రాణాలు చెలగాటం వద్దని... వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని వైఆర్‌ఎస్‌సీపీ ప్రభుత్వాన్ని(YSRCP Government) డిమాండ్‌ చేశారు.


ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు గత ఆరునెలలుగా జగన్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందని.. ఆ బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఈనెల 27వతేదీ  నుంచి ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిపై స్పందించిన నారా లోకేష్‌... వైఎస్‌ఆర్‌  ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి పరిస్థితి... రాష్ట్రం ఉన్న దుస్థితికి అద్దం పడుతోందన్నారు నారా లోకేష్‌. మహమ్మారి కరోనా సమయంలోనే.. సీఎం సొంత జిల్లా  అయిన కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టినప్పుడే సీఎం జగన్ పనితనం ఏంటి అన్నది ప్రజలకు అర్థమైపోయిందన్నారు. చేతగాని పాలనతో  రాష్ట్ర ఖజానాను దివాలా తీయించారని ఆరోపించారు. సీఎం జగన్ ముఖం చూసి కాంట్రాక్టర్లు కూడా పరారయ్యారని విమర్శించారు. 


స్కూళ్లలో విద్యార్థులకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించేందుకు పేపర్లకు కూడా దిక్కులేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్‌. వాట్సాప్‌లో  ప్రశ్నాపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితి ఏపీలో నెలకొందని అన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలతో.. రాష్ట్ర పరిస్థితి పాతాళానికి  పడేశారని అన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి కూడా నిధులు కేటాయించకుండా... నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు నారా లోకేష్‌. ఆరోగ్యశ్రీ  నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన వెయ్యి కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ  సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు టీడీపీ నేత నారా లోకేష్‌. 


ఆరోగ్యశ్రీ కింద రావాల్సిన బకాయిలు రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేసింది ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల సంఘం. బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబుకు లేఖ రాసింది. అంతేకాదు.. వైద్య చికిత్సల ధరలు పెరిగిపోయాయని.. కనుక చికిత్సల ప్యాకేజీ ధరలు కూడా పెంచాలని కోరింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కొన్ని ఆస్పత్రులు 60 నుంచి 90 శాతం ఆరోగ్యశ్రీపైనే ఆధారపడి ఉన్నాయని తెలిపింది. బిల్లుల పెండింగ్‌ పెట్టడం వల్ల.. ఆ ఆస్పత్రులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని విన్నవించుకుంది. బకాయిపడ్డ వెయ్యి కోట్లను కాస్త వెంటనే చెల్లించి.. సమస్యల పరిష్కారానికి సహకరించాలని లేఖలో కోరింది ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల సంఘం. అలాగే... 2013 నుంచి ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచలేదని.. వెంటనే వాటిని పెంచాలి కోరింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది.