Water released from Pattiseema to Krishna Delta : కృష్ణా డెల్టాలో తీవ్రమైన నీటి కొరత ఉండటం గోదావరికి వరద వస్తూండటంతో ప్రభుత్వం పట్టి సీమ ద్వారా నీటిని విడుదల చేసింది.   పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జలాలను మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేశారు.  ఉదయం 7.27 ని.లకు   జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్వీ స్విచ్చాన్ చేశారు.  పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా డెల్టా కు సాగు, తాగు నీటి అవసరాలకు పోలవరం కుడికాలువ ద్వారా తరలిస్తున్నారు. పట్టిసీమ నుండి రోజుకి 7 వేల క్యూసెక్కుల జలాలు తరలించేలా 3 పంపుల నుండి విడుదల చేస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ ఏడాది తొలిసారి పట్టిసీమ స్విచ్ ఆన్ చేయడంతో ముందుగా ప్రత్యేక పూజలు  నిర్వహించారు. 


పోలవరం ముంపు మండలాలు విలీనం చేయించడం చంద్రబాబు ముందు చూపు 
 
నదుల అనుసంధానం ద్వారా మాత్రమే దేశాన్ని కరవు రహితంగా మార్చగలమని నిమ్మల రామానాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు.  దేశంలో ఆ ప్రక్రియకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చన్నారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనం చేయించడం చంద్రబాబు నాయుడు ముందుచూపునకు నిదర్శనమని..   పోలవారం ప్రాజెక్ట్ ఆలస్యం జరుగుతుంది కాబట్టే పట్టసీమను చేపట్టారు.. దీని ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందని గుర్తు చేశారు.          


జగన్ పాలనలో అంతా విధ్వంసమే 


గతంలో పట్టిసీమను మాజీ సీఎం జగన్‌ ఒట్టిసీమ అని ఎద్దేవా చేశారు.. కానీ, ఇప్పుడు అదే బంగారమైంది.. పట్టిసీమ పుణ్యమా అని కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుంది.. జగన్ పాలన అంతా విధ్వంసాలే.. తాగునీటి వ్యవస్థను నిర్వీర్యం చేశారు.. అని వ్యాఖ్యానించారు. పట్టిసీమ నుంచి నీళ్లు విడుదల చేయకపోతే లక్షలాది ప్రజల దాహార్తిని ఎలా తీరుస్తారు? ఒక్క చుక్క నీటినీ వృథా చేయొద్దని ముఖ్యమంత్రి చెప్పారన్నారు.  తాడిపూడి నుంచి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం.. ఏలేరు రిజర్వాయర్‌లో నిల్వ వల్ల స్టీల్‌ ప్లాంట్‌, విశాఖ నగరానికి తాగునీరు అందుతుంది.. ఏలేరులో నీటి నిల్వకు ప్రయత్నిస్తున్నామని గుర్తు చేశారు. ఒకే రోజు నాలుగు పథకాల ద్వారా నీటిని విడుదల చేయడం చరిత్రాత్మకం… అధికారులతో సమన్వయం చేసుకుని నీటి నిర్వహణ సమర్థంగా చేపడుతున్నామన్నారు. 


 పట్టిసీమ ద్వారా పోలవరం ఫలాలు


 పోలవరం ఫలాలు పట్టిసీమ ద్వారా కొంతమేర కృష్ణా డెల్టాకు అందుతున్నాయి  మంత్రి రామానాయుడు అన్నారు. ఇక, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు అటు కృష్ణా డెల్టాలో వేలఎకరాలకు సాగునీరు అందుతుంది. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ ద్వారా నీటి తరలింపునకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. నాలుగేళ్లలో కేవలం 60 టీఎంసీలు వరకు మాత్రమే ఎత్తిపోశారని..రైతులను ఇబ్బంది పెట్టారన్నారు.