Krishnam Raju Memorial: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ రెబల్ స్టార్ కృష్ణం రాజు పేరిట స్మృతి వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయిస్తుందని మంత్రులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణం రాజు స్వగృహంలో నిన్న సంస్మరణ సభ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సభకు రాష్ట్ర మంత్రుు ఆర్కే రోజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణా, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాద రాజుతో పాటు కారుమూరి నాగేశ్వర రావు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రభాస్ ను వారు పరామర్శించారు. తర్వాత ప్రభాస్ లో మాట్లాడిన మంత్రి ఆర్కే రోజా.. కృష్ణం రాజు సంస్మరణ సభ రోజు ప్రభాస్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఆయన పేరు పైన స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 






కృష్ణంరాజు పేరిట స్మృతివనం..


అనంతరం మాట్లాడిన ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వర రావు.. కృష్ణం రాజు లాంటి రెబల్ స్టార్, ప్రముఖ సినీ నటుడు మరణంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు దిగ్భ్రాంతికి గురి అయ్యారని తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో రాణించిన రెబల్ స్టార్ కృష్ణం రాజు మృతి తీరని లోటు అని అన్నారు. స్మృతి వనం ఏర్పాటు విషయాన్ని కృష్ణం రాజు కుటుంబ సభ్యులకు కూడా తెలిపినట్లు వెల్లడించారు. 


పెద్ద ఎత్తున అభిమానులు..


అనారోగ్య కారణాల వల్ల కొన్ని రోజుల క్రితం కృష్ణంరాజు మృతిచెందారు. ఇందుకు సంబంధించి ఆయన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం సంస్మరణ సభ నిర్వహించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ తన సొంత ఊరికి రావడంతో ఆయన అభిమానులు ప్రభాస్ ను ప్రత్యక్షంగా చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మొగల్తూరులోని రోడ్లన్నీ జన సందోహంగా మారాయి. ప్రభాస్ ఇంటి వద్దకు అభిమానులు భారీగా చేరుకున్నారు. రెబల్ స్టార్.. రెబల్ స్టార్ అనే నినాదాలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తింది. అదే విధంగా మొగల్తూరు పట్టణంలో బైక్ ర్యాలీ చేశారు. 2012 లో తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన తరువాత సంతాప కార్యక్రమాల కోసం  మొగల్తూరులో వారం రోజులు గడిపిన ప్రభాస్ మళ్లీ ఇన్నేళ్లకు మొగల్తూరు వచ్చారు. 


లక్ష మందికి భోజన ఏర్పాట్లు..


రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు విచ్చేస్తున్న వారి కోసం సుమారు లక్ష మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయించారు ప్రభాస్. తరలివస్తున్న బంధువులకు,  అభిమానులకు, గ్రామస్తులకు ఎటు వంటి ఇబ్బంది లేకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని ఏర్పాట్లను చేశారు. తనను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులకు కూడా తిని వెళ్లండి డార్లింగ్స్ అంటూ ప్రభాస్ సంబోధించారు. నిన్న సోషల్ మీడియాలో ప్రభాస్ పెట్టిన భోజనం గురించే వేలాది పోస్టులు దర్శనమిచ్చాయి. హైదరాబాద్ లో కృష్ణం రాజు అంతిమ సంస్కారాలకు సంబంధించి తరలి వచ్చిన అభిమానులకు కూడా ప్రభాస్ అంత వేదనలో ఉండి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం తెలిసిందే.