Lok Sabha Elections 2024 Phase 4 campaign ends for 96 seats and polling on May 13 | హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 10 రాష్ట్రాల్లో 96 నియోజకవర్గాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్న చోట ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పార్టీల ప్రచార జోరు ముగిసి మైకులు మూగబోయాయి. మే 13న ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ సీపీ, బీఆర్ఎస్, జనసేన ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. మే 13న ఉదయం 7 గంటల నుంచి కొన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ కు అనుమతి ఇచ్చింది ఈసీ.
అక్కడ ముందే ముగిసిన ప్రచారం
ఏపీ వ్యాప్తంగా శనివారం (మే 11న) సాయంత్రం 6గంటలకు ప్రచారం ముగిసింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటల వరకే ప్రచారానికి ఈసీ సమయం ఇచ్చింది. పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి నియోజకవర్గాల్లో సాయంత్రం 4కే ప్రచారం ముగిసినట్లు ఈసీ పేర్కొంది.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. ఫెసిలిటేషన్ సెంటర్లలో 4,44,216 పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయని చెప్పారు. ఏపీలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు గాను 4,44,216 ఓట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 4,44218 పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్లు వివరించారు. సాయంత్రం 6 తర్వాత సభలు, సమావేశాలు పెట్టకూడదని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రచార సమయం ముగియడంతో స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండేందుకు వీలులేదని పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చిన వారంతా నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని తెలిపింది.
తెలంగాణలో అక్కడ ముందే ముగిసిన ప్రచారం
ఏపీ తరహాలోనే తెలంగాణలోనూ సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగిసింది. 5 లోక్ సభ నియోజకవర్గాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం ముగిసింది. సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని అసెంబ్లీ స్థానాలల్లో ముందే ప్రచారం ముగిసింది. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ పరిధిలో, మహబూబాబాద్ ఎంపీ స్థానం పరిధిలో భద్రాచలం, ములుగు, పినపాక, ఇల్లందు, అసెంబ్లీ సెగ్మెంట్లలో, ఖమ్మం ఎంపీ స్థానంలో పరిధిలో కొత్తగూడెం, అశ్వరావుపేటలో ఈసీ ఆదేశాలతో మిగతా స్థానాల కంటే ముందే ప్రచారం ముగించారు. మిగతా నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసి మైకులు మూగబోయాయి.
అమల్లోకి 144 సెక్షన్
ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాష్ట్రం అంతటా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమలు అవుతుంది. నలుగురి కంటే ఎక్కువ వ్యక్తులు ఒకేసారి కలిసి తిరుగొద్దు. మీడియాలో ఆరు గంటల నుంచి ఎలాంటి ప్రచారం చేయొద్దు. కొన్ని సంస్థలు మే 13న సెలవు ఇవ్వడం లేదని గుర్తించిన ఈసీ, చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.