ఆంధ్రప్రదేశ్ లో బడిగంట మోగింది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలు తెరవచ్చని విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. తరగతి గదిలో 20 మంది విద్యార్థులు మించకూడదు. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులు తరగతులకు హాజరుకావాలి.
రోజు విడిచి రోజు తరగతులు
విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. విద్యాసంస్థల లోపల, బయట పూర్తిస్థాయిలో శానిటైజేషన్ చేయాలి. ఉపాధ్యాయులు, సిబ్బంది ప్రతిరోజూ పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఆదేశించింది. తరగతుల్లో పిల్లల సంఖ్య అధికంగా ఉంటే రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించారు.
Also Read: APSWREIS Recruitment 2021: రెండ్రోజుల్లో ముగియనున్న గడువు.. ఈ పోస్టులకు అప్లయ్ చేశారా?
ఆ విద్యార్థులకు ఐసోలేషన్ గది
పాఠశాలల్లోకి ప్రవేశించే ముందు విద్యా్ర్థులకు థర్మల్ స్కానింగ్ చేస్తారు. విద్యార్థులలో ఎవరికైనా జలుబు, జ్వరం, కొవిడ్ లక్షణాలు ఉంటే... వారిని ఇళ్లకు తిరిగి పంపి కరోనా నిర్థారణ పరీక్షలు చేయించనున్నారు. కోవిడ్ లక్షణాలున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించనున్నారు. ఇళ్లలో కొవిడ్ బాధితులు, వృద్ధులు, రోగులు ఉన్న విద్యార్థులు పాఠశాలలకు రాకుండా ఇంటి వద్దనే ఉండాలని విద్యాశాఖ సూచించింది. అనారోగ్యంతో ఉండే విద్యార్థులు స్కూళ్లకు రాకుండా ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడికి ప్రతి వారం కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించాలని సూచించింది. వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ ఉంటే మిగతా విద్యార్థులందరికీ పరీక్షలు చేయించాలని అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు పంపింది.
కోవిడ్ జాగ్రత్తలపై ఓ పీరియడ్
తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఏర్పాట్లు చేయించాలని విద్యాశాఖ సూచించింది. మధ్యాహ్న భోజనం సమయంలోనూ అందరికీ ఒకేసారి కాకుండా విడివిడిగా భోజన ఏర్పాట్లు చేయాలని తెలిపింది. స్కూలు నుంచి విద్యార్థులు వెళ్లే సమయంలోనూ అందర్నీ ఒకేసారి కాకుండా 10 నిమిషాల వ్యవధిలో బయటకు పంపమని సూచించింది. స్కూలుకు వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు భౌతిక దూరం ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు తెలిపింది. స్కూలులో కోవిడ్ నిబంధనలపై ఒక పీరియడ్ తీసుకోవాలని చెప్పింది. విద్యార్థులు గుంపులుగా లేకుండా చూసుకోవాలని తెలిపింది. స్కూలు అసెంబ్లీ, గేమ్స్ వంటివి పూర్తిగా రద్దు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది.
Also Read: AP Schools: ఆ పిల్లల చదువులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అదే స్కూళ్లల్లోనే కొనసాగించాలని ఆదేశాలు